చంద్రబాబుకు రాజధాని వారసుల షాక్...

Chakravarthi Kalyan

రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు సేకరించడంలో చంద్రబాబు సర్కారు విజయం సాధించింది. మొదట్లో భూములిచ్చేందుకు ససేమిరా అన్న రైతులు... మంత్రుల మంత్రాంగంతో చివరకు దిగివస్తున్నారు. పరిహారం విషయంలో పేచీ పెట్టిన జరీబు రైతులు కూడా అదనపు పరిహార ప్రకటనతో సర్దుకుపోతున్నారు. ప్రభుత్వంతో పోరాడి సాధించేదేమీ ఉండదన్న ఆలోచనతో భూములు ఇచ్చేస్తున్నారు.

భూసమీకరణ మొదట్లో తలెత్తిన ఇబ్బందులతో ఓ సారి గడువు పెంచిన అధికారులు.. మరోసారి గడువు పెంచే అవసరం లేకుండానే సమీకరణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం తొలివిడతలో 35 వేల ఎకరాలు టార్గెట్ చేసుకోగా.. దాదాపు 30 వేల ఎకరాల వరకూ భూసమీకరణ పూర్తయింది. సర్కారు జరీబు రైతుల డిమాండ్లకు తలొగ్గడంతో మిగిలిన భూమి కూడా చివరిరోజు కచ్చితంగా సర్కారు ఖాతాలో పడిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇంతవరకూ తమ ప్లాన్ బ్రహ్మాండంగా వర్క్ ఔట్ అయిందని భావిస్తున్న సర్కారు పెద్దలకు ఇప్పుడు వారసుల రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడుతోంది. విదేశాల్లోనూ, నగరాల్లోనూ ఉంటున్న రాజధాని ప్రాంతరైతుల వారసులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారు. రైతులను సర్కారు ఎలాగోలా ఒప్పించినా.. వారి వారసులు మాత్రం న్యాయపోరాటానికే సిద్ధమంటున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు డిప్యూటీ కలెక్టర్లకు ఈ మేరకు నోటీసులిచ్చారు.

వారసత్వంగా వచ్చిన భూమిపై వారసులందరికీ హక్కు ఉంటుంది. రైతు ఒక్కటే తన ఇష్టం వచ్చినట్టు రాసిచ్చేందుకు కుదరదు. ఆ భూమి అతని స్వార్జితమైతే.. అతనిష్టం వచ్చినట్టు ఎవరికైనా రాసివ్వొచ్చు.. ఈ పాయింట్ పట్టుకునే ఇప్పుడు వారసులు తమకు భూసమీకరణ ఆమోదయోగ్యం కాదని సెక్షన్ నోటీసులు ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: