ఆకాశం నుంచి ఊడిపడి.. బీహార్ ను భయపెట్టింది..

Balachander
ఈ   విశ్వంలో ఎన్నో వింతలూ విశేషాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.  అప్పుడప్పుడు మాత్రమే అవి మన కంటికి కనిపిస్తుంటాయి.  అలాంటి వింతల్లో కొన్ని మనకు తెలిసినపుడు షాక్ అవుతుంటాం.  అలా షాక్ ఇచ్చే సంఘటన ఒకటి ఇటీవలే బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.  దాని గురించి విన్న చాలా మంది మొదట భయపడిపోయారు.  ఏదో  జరగబోతుందని భయపడ్డారు.  


కానీ అక్కడ అలాంటిది ఏమి లేదు. భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.  ఇంతకీ ఆ సంఘటన ఏంటి.. అసలేం జరిగింది తెలుసుకుందాం.  బిహార్‌లోని మధుబని జిల్లాలో ఆకాశంలోంచి పడిన ఒక ఉల్క స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.  ఒకింత భయాన్ని కూడా కలిగించింది.  ఎప్పటిలాగే రైతులు పొలంలో పని చేసుకుంటుండగా అకాస్మాత్తుగా ఆకాశంలో పెద్దశబ్దం వచ్చింది.  


దీంతో రైతులు ఏంటని చూస్తే బండరాయి మాదిరిగా ఉన్న ఒక పదార్థం పెద్దగా శబ్దం చేస్తూ ఆకాశంలోంచి దూసుకువచ్చి పొలంలో పడింది. ఈ ఘటనతో రైతులు ఎంతో భయాందోళనకు గురయ్యారు. అది భూమిలో పడిన స్థలంలో నాలుగు అడుగుల లోతుకు దూసుకెళ్లగా, గ్రామస్థుల సాయంతో బయటికి తీశామన్నారు. అనంతరం దాన్ని పరిశీలించిన గ్రామస్థులు ఆ రాయికి ఆకర్షణశక్తి చాలా ఎక్కువగా ఉందని, దాని బరువు 33 పౌండ్లు ఉన్నట్లు గుర్తించారు. 


 దాన్ని ఆ  గ్రామ ప్రజల సహకారంతో రైతులు ఆ పదార్ధాన్ని ప్రభుత్వాధికారులకు అందజేశారు.  అనంతరం ప్రభుత్వాధికారులు దాన్ని శాస్త్రవేత్తలకు అప్పగించారు.  ఈ పదార్థాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఉల్క లక్షణాలు ఉన్నాయని విశ్లేషించారు. సాధారణంగా ఉల్కలు అనేవి దుమ్ము, రాయి లాంటి కణాలను కలుపుకుని ఒక గట్టి పదార్థంగా ఏర్పడుతాయని అన్నారు.

ఈ ఉల్కని అధికారులు పట్నాలోని మ్యూజియానికి తరలించారు.  ఆ పదార్థంపై మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నట్టు అక్కడి శాస్త్రవేత్తలు  చెప్పారు.  భూమికి దగ్గరగా ఓ ఉల్కా వస్తోందని గతంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  బహుశా దాని శకలం అయ్యి ఉండొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: