గల్లా జయదేవ్ అసలు రంగు బయటపడింది ..!

Prathap Kaluva

గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ ప్రత్యేక హోదా కోసం మేమే పోరాటం చేశామని బిల్డప్పులు ఇచ్చిన ఈయన గారు ఇప్పుడు సాంతం చేతులెత్తేశారు. ప్రత్యేకహోదా తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా జగన్ దే అంటూ ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పడం ద్వారా.. ఇక ఆ విషయాన్ని తాము పట్టించుకునేది లేదని సంకేతాలు ఇచ్చేశారు. స్పష్టంగా మాట్లాడుకోవాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది రావడం అసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం హోదా ఇచ్చే ఉద్దేశంతో లేదు. ఆ విషయం స్పష్టం అయిపోయింది.


రాష్ట్ర నాయకులు ఆ మాటను అంతే స్పష్టంగా ప్రజలకు చెప్పగల పరిస్థితిలో లేరు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ హోదా అడుగుతూనే ఉంటాం.. అని ప్రజల ఆశలను నీరుగార్చలేక జగన్ ఒకమాట అని ఊరుకున్నారు. ఎన్నికలకు ముందే జగన్ చాలా స్పష్టంగా వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు కేంద్రంలో అధికారానికి అవసరమయ్యే పక్షంలో హోదా ఇచ్చే పార్టీకే  మద్దతిస్తాం.. మేం ఎవ్వరికీ అనుకూలంగా- ప్రతికూలంగా ఉండం అని ప్రకటించారు.


కానీ ఇప్పుడు వైకాపా బలం కాదు కదా.. మిత్రపక్షాల బలం కూడా అవసరం లేని భాజపా సర్కారు వచ్చింది. ఇప్పడిక ‘అడుగుతూ ఉంటా’ననడం తప్ప జగన్ చేయగలిగింది ఏమీలేదు. తనను గెలిపిస్తే ప్రత్యేకహోదా తీసుకువచ్చేస్తానంటూ.. ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన గల్లా జయదేవ్.. ఏకంగా కాడి పక్కన పారేస్తున్నాడు. జగన్ తేవాల్సిందే.. మాకేమీ సంబంధం లేదని తేల్చేస్తున్నాడు. ఈ అవకాశవాద రాజకీయాలను ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు. డబ్బు వెదజల్లి గెలవడం అనేది ప్రతిసారీ సాధ్యమయ్యే కిటుకు కాదు. ప్రజలను మోసం చేస్తున్నందుకు ఇవాళ కాకపోతే రేపైనా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: