లండన్ లో నీరవ్ మోదీ అరెస్ట్..! మరి భారత్ కు ఎప్పుడు..??

Vasishta

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ లండన్ లో అరెస్ట్ అయ్యారు. లండన్ వెస్ట్ కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు నీరవ్ మోదీని అరెస్ట్ చేసినట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. హోల్ బర్న్ లో అదుపులోకి తీసుకున్న నీరవ్ మోదీని రేపు వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నారు. కోర్టులో ప్రొసీజర్స్ అనంతరం నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే అవకాశం ఉంది.


పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.13వేల కోట్ల కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నీరవ్ మోదీ .. ఇటీవల లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ మీడియాతో మాట్లాడారు. దీంతో అతనికి లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.


2018 ఫిబ్రవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలోనే నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతనితో పాటు అతని మేనమామ, మరో స్కాంలో నిందితుడైన మెహుల్ చోక్సీ కూడా దేశం వదిలి పారిపోయాడు. చోక్సీ ఇప్పుడు ఆంటిగ్వాలో ఉంటున్నట్టు సమాచారం.


నీరవ్ వ్యవహారంపై భారత్ లో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ నేరారోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్ లో ఉంటున్నారని తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు ఆయన్ను భారత్ కు అప్పగించాల్సిందిగా ఆ దేశానికి విజ్ఞప్తి చేశాయి. ఇక్కడ మోసం చేసి అక్కడ మారువేషంలో మళ్లీ ఫ్రెష్ గా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది.


లండన్ పోలీసులు నీరవ్ మోదీని అరెస్ట్ చేయడంతో ఆతణ్ణి భారత్ కు అప్పగించే ప్రక్రియ మొదలుకానుంది. భారత్ కు అప్పగిస్తే అతడికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు.. ఇక్కడ ప్రాణభయం ఏమైనా ఉంటుందా.. లాంటి అనేక అంశాలను భారత్ కోర్టుకు వెల్లడించాల్సి ఉంటుంది. కోర్టు సంతృప్తి చెందితే అప్పుడు అతడిని అప్పగించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: