కుటుంబ సభ్యులా.. శత్రువులా.. రావు రమేశ్‌ డైలాగ్‌ను నిరూపించేశారుగా?

మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే  బంధుత్వం, రక్త సంబంధాల పేరుతో  తిరుగుతూ ఉంటారు అనేది అ.. ఆ సినిమాలో రావు రమేశ్ డైలాగ్.  దీనిని నిజం చేసి చూపిస్తున్నారు రాజకీయ నాయకుల కుటుంబాలు.  గత సారి తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్నాయి.  నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. ఆయన మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

నాడు టీడీపీలో చాలామంది నాయకుల కుటుంబాల్లో చీలిక తెచ్చి వైసీపీ లబ్ధి పొందిందనే ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలానే తయారైంది. సీఎం జగన్ కుటుంబంలో భారీగా చీలిక వచ్చింది. ఆ కుటుంబం అడ్డగోలుగా విడిపోయింది.  సోదరీ  మణులు షర్మిళ, సునీతల జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి వైసీపీని ఇబ్బంది పెడుతున్నారని జగన్ కూడా పలు సభల్లో పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంలో సగం మంది జగన్ వెంట.. మిగతా సగం షర్మిళ వెంట నిలబడ్డారు. దీంతో సగటు వైఎస్ అభిమాని ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు.

ఇక తాజాగా అంబటి రాంబాబు సొంత అల్లుడు, మామపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను గెలిపించవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వ విషయంలో చాలా విషయాలు బయట పెట్టాడు. ఇప్పుడు అవే వైరల్ గా మారాయి. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుడు కూడా ఇలానే వ్యాఖ్యానించారు.

మరో వైపు ముద్రంగడ పద్మనాభం మరోసారి జగన్ ను సీఎం చేయాలని చూస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె సైతం తన తండ్రి వైఖరిని తప్పు పట్టడం విశేషం. పైగా తన తండ్రి ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ ను గెలిపించాలని.. ఆయనకే తమ మద్దతు అని ప్రకటించేశారు. అయితే ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలకు కుటుంబ పోటు ఎదురు కావడం మాత్రం ఇబ్బందికర పరిణామమే. గత ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఫలితాలే ఇప్పుడు వైసీపీకి ఎదురవుతాయా అనే సందేహాలు పలువురిలో నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: