ఎడిటోరియల్ : హిందుపురంలో గెలుపుకు టిడిపి కుట్ర మొదలుపెట్టిందా ?

Vijaya

అలాగే ఉంది చూస్తుంటే. హిందుపురం లోక్ సభలో చాలాకాలం తర్వాత ప్రతిపక్షం నుండి గట్టి అభ్యర్ధి ఎదురయ్యారు. రేపటి ఎన్నికల్లో హిందుపురంలో గెలిచేది వైసిపి అభ్యర్ధి గోరంట్ల మాధవే అనే ప్రచారం ఉదృతంగా జరుగుతోంది. దాంతో కలవరపడిన టిడిపి మాధవ్ ను నామినేషనే వేయకుండా అడ్డుకుంటోంది.

 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాలోని కదిరిలో సిఐగా పనిచేస్తున్నారు. అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. దాంతో మాధవ్ వెంటనే జగన్మోహన్ రెడ్డి కంట్లో పడ్డారు. ఆరాతీస్తే సిఐకున్న గుడ్ విల్, నేపధ్యం మొత్తం బయటకు వచ్చింది. అప్పటికే హిందుపురం లోక్ సభకు గట్టి అభ్యర్ధిని వెతుకుతున్నారు. ఇంకేముంది వెంటనే మాధవ్ కు పిలుపెళ్ళింది.

 

హిందుపురం లోక్ సభ లో వైసిపి తరపున పోటీ చేయటానికి అంగీకరించారు. వెంటనే విఆర్ఎస్ కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దాంతో హిందుపురం నియోజకవర్గం పరిధిలో ఒక్కసారిగా వైసిపి పుంజుకుంది. ఎప్పుడైతే వైసిపి పుంజుకుందో టిడిపిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే, చాలా కాలంగా ఇక్కడ టిడిపినే గెలుస్తోంది.

 

బిసి సామాజికవర్గం బాగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇపుడు వైసిపి కూడా మాధవ్ ను పెట్టటంతో టిడిపికి ఇబ్బంది మొదలైంది. బిసిల్లో కూడా కురబ ఉపకులానిదే మెజారిటీనట. మాధవ్ కురబ ఉపకులానికి చెందిన పోలీసు అధికారి కావటంతో బాగా ఊపొచ్చింది. దాంతో రేపటి ఎన్నికల్లో టిడిపి గెలుపు కష్టమనే ప్రచారం మొదలైపోయింది. అందుకనే మాధవ్ విఆర్ఎస్ కు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తొక్కిపెట్టింది. అది ఆమోదం పొందితే కానీ నామినేషన్ వేసేందుకు లేదు.

 

నిబంధనల ప్రకారం మూడు నెలలకు ముందు రాజీనామా చేస్తేకానీ విఆర్ఎస్ ఆమోదం పొందట. ఇపుడా నిబంధనను తెరపైకి తెచ్చి నామినేషన్ ను అడ్డుకుంటున్నారు.  ఈ విషయాన్ని ఊహించే మాధవ్ కోర్టులో కేసు వేశారు. ఈ రోజు కోర్టులో జరిగే విచారణపైనే మాధవ్ రాజకీయ జీవితం ఆధారపడుంది. మరి ఏం అవుతుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: