రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు

గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఆయన తుది శ్వాస తీసుకున్నారు. 


ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. హావాయి పాదరక్షలు.  మందీమార్బలం లేకుండా ప్రయాణం. ప్రజలు ఎక్కడ ఉన్నా అక్కడ ఆగి వారి యోగక్షేమాలు విచారించడం..ఇవి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ కన్నుమూసిన మనోహర్‌ పారికర్‌ ప్రత్యేకతలు. ఐఐటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రాజకీయాల్లోకి వచ్చిన పారికర్‌ గోవా సామాన్యుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.


*మనోహర్ పారికర్‌ తొలిసారి 1994 లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు.

*1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.

*2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్‌ మళ్ళీ 2002 జూన్ 5 న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

*2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు.

*ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దిగంబర్ కామత్‌ సీఎం అయ్యారు.

*అయితే, 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు.

*2014లో ఎన్డీయే కేంద్రంలో అధికారంలో రావడంతో ప్రధాని నరేంద్ర  మోదీ ఆహ్వానం మేరకు కేంద్ర రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో భద్రతాదళా ల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆయుధ సేకరణలో పారదర్శక విధానాలు అవలంభించారు. గోవా లాంటి చిన్న రాష్ట్రానికి చెందిన వారు అయినప్పటికీ కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారంటే ఆయన కున్న ప్రాధాన్యం తెలుస్తోంది.

*2017లో జరిగిన రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మెజార్టీ రాలేదు. మొత్తం 40 సీట్లలో 17 సీట్లు సాధించి అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన పారికర్‌ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రంగా మారారు. 


దేశ రాజకీయాల్లో పారికర్‌ ది ప్రత్యేక స్థానం. గోవా సీఎంగా, దేశ రక్షణ మంత్రి గా ఉన్న సమయంలో నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థు లు సైతం ప్రభుత్వ విధానాలను విమర్శించేవారే గానీ ఆయన వైఖరిని తప్పుబట్టేవారు కాదు. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు నిర్వహించి భాజపాను రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేశారు. 

గోవాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ తో పాటు క్రైస్తవ మత ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు వర్గాలను కలుపుకోవడంలో పారికర్‌ సఫలీకృతుడయ్యారు. 1994 లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఇప్పటి వరకు పారికర్‌ గోవా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. గోవాలో ప్రభుత్వాలు స్థిరంగా ఉండేవికావు.  1990-2002 మధ్య కాలంలో 13 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి.  ముక్కు సూటితనం, నిజాయితీ, నిరాడంబరతలతో గోవా ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించు కున్నారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకు చికిత్స తీసుకుంటూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: