ఎడిటోరియల్ : జనసేన వల్ల టిడిపి, వైసిపిల్లో ఎవరికి మైనస్ ?

Vijaya

మిగితా విషయాలు ఎలాగున్నా అధికారికంగా  అభ్యర్ధుల ప్రకటనలో మాత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మిగితా పార్టీలకన్నా ముందున్నారు.  32 అసెంబ్లీ స్ధానాలు, నాలుగు లోక్ సభ సీట్లకు పవన్ ఓ జాబితాను విడుదల చేశారు. అయితే, అందులో అత్యధిక అభ్యర్ధుల పేర్లు చాలామందికి తెలీవనే అనుకోవాలి. ఇక చాలామందికి తెలిసిన అభ్యర్ధుల గెలుపు కూడా అనుమానమే.

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే  అధికారం కోసం టిడిపి, వైసిపిల అధినేతలు అభ్యర్ధుల ఎంపికలో అధినేతలు మల్లగుల్లాలు పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. పై ఇద్దరిలో కూడా టిడిపిలో ఎక్కడ చూసినా గందరగోళమే కనబడుతోంది. పోటీ చేయమని అడిగితే సిట్టింగులతో పాటు చాలామంది నేతలు లోక్ సభ నియోజకవర్గాలకు దూరంగా జరిగిపోతున్నారు. అదే సమయంలో అసెంబ్లీకి తామడిగిన టికెట్ ఇవ్వకపోతే బాగుండదనేట్లుగా చంద్రబాబునాయుడునే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

 

ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిస్ధితే కాస్త నయంగా ఉంది. ఏవో కొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే అసంతృప్తులు కనబడుతున్నాయి. 16వ తేదీన జాబితా ప్రకటించిన తర్వాత అసంతృప్తి రోడ్డెక్కుతోందేమో చూడాలి. పై రెండు పార్టీలతో పోల్చుకుంటే జనసేన పనే హాయిగా ఉంది. ఎందుకంటే, టికెట్లు అడిగే వారు లేరు. గట్టిగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్న వాళ్ళు కూడా కనబడటం లేదు. అందుకనే జనసేన అభ్యర్ధులు గెలవకపోయినా టిడిపి, వైసిపిల్లో ఎవరో ఒకరిని ఓడగొట్టటానికి మాత్రం పనికొస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

ప్రకటించిన  32 మంది అసెంబ్లీ అభ్యర్ధుల్లో అందరికీ తెలిసిన వారు మహా అయితే ఓ పదిమందుంటారు. విచిత్రమేమిటంటే వాళ్ళలో కూడా ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పేందుకు లేనివాళ్ళే. రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్, కాకినాడలో ముత్తంశెట్టి శశిధర్, తాడేపల్లి గూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, పాడేరులో పసుపులేటి బాలరాజు, తెనాలిలో నాదెండ్ల మనోహర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తోట చంద్రశేఖర్, పత్తిపాడులో రావెల కిషోర్ బాబు తో పాటు రాజమండ్రి ఎంపి అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ అందరికీ తెలిసిన వాళ్ళు.

 

పవన్ ప్రకటించిన మొదటిజాబితాలో గెలుస్తారని గట్టిగా చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళ కూడా కనబడటం లేదు. ఇపుడు కూడా టిడిపి, వైసిపిలోని అసంతృప్త నేతలు పై రెండు పార్టీల మధ్యే మారుతున్నారు కానీ ఒక్కళ్ళు కూడా జనసేన వైపు చూడటం లేదు. ఇక్కడే జనసేన కెపాసిటీ ఏంటో తెలిసిపోతోంది. ఇక జనసేన అభ్యర్ధులు తెచ్చుకునే ప్రతీ ఓటు టిడిపికి పడేదే అనుకోవాలి. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేశారు. అప్పట్లో పవన్ చెబితేనే టిడిపికి ఓట్లేసిన వాళ్ళు ఇపుడు జనసేనకు వేస్తారు. అంటే జనసేనకు పడే ప్రతీ ఓటు టిడిపికి మైనస్సనే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: