ఎడిటోరియల్ : పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో తెలుసా ?

Vijaya

మొదటి నుండి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి అయోమయంగానే ఉంటోంది. ఏమాట్టాడుతారో తెలీదు. ఏం చెబుతున్నారో తెలీదు. చెప్పేదొకటి చేసేదొకటి. నాలుగు రోజుల యాత్రంటారు ఒక్కరోజుకే యాత్రను ముగించి అడ్రస్ లేకుండా పోతారు. ఇటువంటి పవన్ రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ఖరారు చేసుకోలేకపోతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. మొత్తం మీద నాలుగు అసెంబ్లీలపై పవన్ తరపున సర్వేలు చేస్తున్నారట.

 

తాను పోటీ  చేయబోయే నియోజకవర్గంపై తనకే స్పష్టత లేదంటే ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎలా ఖరారు చేస్తారు ?  25 మంది లోక్ సభ ఎంపి అభ్యర్ధులను ఎలా ఎంపిక చేయగలుగుతారు ?  యాత్ర ఏ జిల్లాలో చేస్తే ఆ జిల్లాల నుండి పోటీ చేస్తానని పవన్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదో అభిమానులను ఉత్తేజపరచటానికి అటువంటి ప్రకటనలు పనికొస్తాయంతే.

 

ఏడుదశల్లో ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటిదశలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటం పవన్ కు పెద్ద షాకే. ఎందుకంటే, పోటీకి ఆశావహులనుండి దరఖాస్తుల స్వీకరణ దశలొనే ఉంది. దరఖాస్తుల స్క్రూటినీ జరగాలి, ఆశావహులను ఎంపిక చేయాలి, వారితో మాట్లాడాలి తర్వాత అభ్యర్ధులను ప్రకటించాలి. ఇదంతా పూర్తి చేసి అభ్యర్ధులను ప్రకటించటానికి ఉన్న సమయం ఐదు రోజులు మాత్రమే. ఎందుకంటే 18వ తేదీ నుండి నామినేషన్లు వేయాలి.

 

ఇన్ని గందరగోళాలు ఒకవైపు పెట్టుకుని అసలు తాను పోటీ చేసే స్ధానంపైనే పవన్ కు క్లారిటీ లేకపోవటమంటే విచిత్రమే. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గాల్లో పవన్ గెలుపుపై సర్వేలు జరుగుతున్నాయట. అవెప్పటికయ్యేను, నామినేషన్లు ఎప్పటికేసేను ? మొత్తానికి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఎన్నికలను పవన్ సీరియస్ గా తీసుకున్నట్లు లేదని అర్ధమవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: