ఎడిటోరియల్ : ఇద్దరూ ఇద్దరే..ఎన్నికకో పార్టీ, నియోజకవర్గం

Vijaya

అవును ఇద్దరికి ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో ప్రతీ ఎన్నికకు ఓ పార్టీ మారుతుంతే మరొకరేమో ప్రతీ ఎన్నికకు ఓ నియోజకవర్గం మారుతున్నారు. ఇదంతా ఎవరిని ఉద్దేశించో కొత్తగా చెప్పక్కర్లేదు ఈపాటికే అర్ధమై ఉంటుంది. అవును గంటా శ్రీనివాసరావు, చలమలశెట్టి సునీల్ గురించే ఇదంతా.


 పై ఇద్దరిలో చలమలశుట్టితో పోల్చుకుంటే గంటా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికకో నియోజకవర్గం మారుతున్నా గెలుస్తునే ఉన్నారు. అదే సమయంలో మంత్రి పదవిని కూడా అందుకుంటున్నారు. అందులో భాగంగానే పై ఇద్దరూ తాజాగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

 

ముందుగా చలమలశెట్టి గురించి చూద్దాం. 2009లో ప్రజారాజ్యంపార్టీ తరపున రాజకీయాల్లోకి  శ్రీకారం చుట్టారు. అప్పట్లో కాకినాడ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉండి ఎన్నికలు వస్తున్న సమయంలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వైసిపిలో చేరి 2014లో కాకినాడ నుండే పోటీ చేసి ఓడిపోయారు. షరా మామూలుగానే జనజీవన శ్రవంతిలో కనబడలేదు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా ? అందుకనే యాక్టివ్ అయ్యారు.

 

అయితే, జగన్మోహన్ రెడ్డి దగ్గర పప్పులుడకలేదు. దాంతో వైసిపికి దూరమైపోయారు. దాంతో పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని జనసేనాని పవన్ కల్యాన్ దగ్గరకు వెళ్ళారు. పవన్ భేటీ అయి ఫొటోలు దిగి జనసేనలో కలుస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకే అమరావతిలో చంద్రబాబు దగ్గర ప్రత్యక్షమయ్యారు. చివరకు టిడిపిలో చేరారు. బహుశా రాబోయే ఎన్నికల్లో కాకినాడ నుండే ఎంపిగా బరిలోకి దిగొచ్చు.

 

ఇక గంటా సంగతి తీసుకుంటే మొదటిసారి అనకాపల్లి ఎంపిగా టిడిపి తరపున గెలిచారు. తర్వాత చోడవరం ఎంఎల్ఏగా టిడిపి తరపునే  గెలిచారు. మళ్ళీ అనకాపల్లి ఎంఎల్ఏగా పిఆర్పి తరపున గెలిచారు. కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ సభ్యుడైపోయి మంత్రయ్యారు.  పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున భీమిలీలో పోటీ చేసి గెలిచి మంత్రయ్యారు. రేపటి ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసేది సస్పెన్స్. విచిత్రమేమిటంటే ఇద్దరు కాపు సామాజికవర్గం నేతలే. ఇద్దరూ ఆర్ధికంగా బలమైన వాళ్ళే. కాకపోతే గంటాకు అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకుంది. సునీల్ కు యోగం పట్టలేదంతే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: