టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఇదే..!?

Vasishta

ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎత్తులు, పైఎత్తుల్లో బిజీగా ఉంటున్నాయి. ఏఏ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటి.. నేతల స్టామినా ఏంటి లాంటి లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఎక్కడ ఎవర్ని నిలబెడితే గెలుపు ఖాయమో సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే సర్వేలతో సంబంధం లేకుండా పోటీ చేయకుండానే టీడీపీ ఓ సీటును పోగొట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆ సీటేంటో తెలుసా..?


చీరాల పేరు వింటే చాలు .. ఆమంచి కృష్ణ మోహన్ పేరే వినిపిస్తుంది. అతనికున్న హవా అలాంటిది మరి. 2014లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం హవా వీచినా, ఆమంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాడంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆమంచి టీడీపీ నుంచి వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి.


పార్టీతో సంబంధం లేకుండా కేవలం తన ఇమేజ్ తో విజయం సాధించేవారిలో ఆమంచి కృష్ణమోహన్ ఒకరు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆయనకున్న పలుకుబడి అలాంటిది. మాజీ సీఎం రోశయ్య అనుచరుడిగా పేరొందిన ఆమంచి కృష్ణమోహన్.., కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి నవోదయం పార్టీ తరపున 2014లో బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశంపార్టీలో చేరారు.


తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చీరాలలో అన్నీ తానై వ్యవహరించారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలతో విభేదాలున్నా .. సీఎం చంద్రబాబు ఆయనకు తగిన గౌరవమిచ్చారు. దీంతో సర్దుకుపోయారు. అయితే ఇటీవల తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థి పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇవ్వడం, అనంతరం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించడం ఆమంచి ఆగ్రహానికి కారణమయ్యాయి. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారేమోననే సందేహం కలిగించేలా చేశాయి. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.


దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం ఇటీవల వైసీపీలో చేరారు. దగ్గుబాటితో ఆమంచి కృష్ణమోహన్ కు వ్యాపార లావాదేవీలున్నాయి. దగ్గుబాటి వైసీపీలో చేరిన తర్వాత ఆమంచికి ఆ పార్టీలో రాచబాట పరిచినట్లయింది. దీంతో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది. ఇంతలో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి రాయబారాలు నడిపింది. మంత్రి శిద్దా రాఘవరావును ఆమంచి దగ్గరకు పంపి చంద్రబాబును కలిసేలా చూసింది. రెండ్రోజుల తర్వాత ఆమంచి సీఎం చంద్రబాబును కలిసి తన ఇబ్బందులను తెలియజేశారు. అన్నింటినీ విన్న చంద్రబాబు తాను చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు.


అయితే ఇప్పటికీ ఆమంచి పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. దగ్గుబాటితో ఆయనకున్న సాన్నిహిత్యం అలాంటిది. అందుకే ఆయన పార్టీ మారుతారని జోరుగా జిల్లాలో ప్రచారం సాగుతోంది. పర్చూరు నియోజకవర్గంలో కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గం నుంచి ఈసారి దగ్గుబాటి తనయుడు హితేశ్ చెంచురాం వైసీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి తోడుంటే ఆ సీట్లో విజయం సాధించవచ్చనేది దగ్గుబాటి ప్లాన్. అందుకే ఆమంచిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు దగ్గుబాటి స్కెచ్ వేశారు. మరి ఆమంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: