ఎడిటోరియల్ : చినబాబు గాలి తీసేసిన చంద్రబాబు

Vijaya

చినబాబు నారా లోకేష్ గాలిని పెదబాబు చంద్రబాబునాయుడు సాంతం తీసిపారేశారు. దాదాపు ఏడాది క్రితం చినబాబు నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళారు. పర్యటనకు వెళ్ళిన లోకేష్ వెళ్ళిన కార్యక్రమం ఏదో చూసుకుని రాకుండా ఎంపి టిక్కెట్టు బుట్టకే అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఒక్క బుట్ట టిక్కెట్టె కాదులేండి కర్నూలు ఎంఎల్ఏ టిక్కెట్టును ఎస్వీ మోహన్ రెడ్డికేనంటూ ప్రకటించారు. పైగా ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని జనాలకు పిలుపుకూడా ఇఛ్చారు లేండి.

 

ఎంపి టిక్కెట్టును పక్కనపెడితే ఎంఎల్ఏ టిక్కెట్టు ప్రకటించిన విషయమై అప్పట్లో కర్నూలులో ఎంతలావు మంటలు మండాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. టిక్కెట్లు ప్రకటించటానికి లోకేష్ కున్న అధికారాలేంటని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ బహిరంగంగానే చినబాబును ఫుల్లుగా కడిగిపారేశారు. అభ్యర్ధులను ప్రకటిస్తే చంద్రబాబునాయుడే ప్రకటించాలి కానీ మధ్యలో లోకేష్ ఎవరంటూ లోకేష్ పై టిజి బహిరంగంగానే మండిపడ్డారు. సరే అదంతా చరిత్ర అయిపోయింది లేండి.

 

సీన్ కట్ చేస్తే ఎంఎల్ఏ టిక్కెట్టు సంగతి పక్కన పెడితే ఎంపిగా లోకేష్ ప్రకటించిన బుట్టాకు చంద్రబాబు పెద్ద హ్యాండే ఇచ్చారు. అంటే టిక్కెట్ల విషయంలో లోకేష్ కు చంద్రబాబు ఇస్తున్న విలువేంటో అందరికీ తెలిసిపోయింది. నిజానికి లోకేష్ ను పట్టుకుంటే టిక్కెట్టు ఖాయమని బుట్టా భావించినట్లున్నారు. అందుకనే లోకేష్ తో బుట్టా మంచి రాపో మెయిన్ టైన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా తయారైంది చంద్రబాబు దగ్గర వ్యవహారం.


వైసిపిలో నుండి బుట్టాను టిడిపిలోకి లాక్కునేటపుడు చంద్రబాబు కూడా ఎంపి టిక్కెట్టే హామీ ఇచ్చారు. కానీ సమీకరణలు మారేటప్పటికి ఎంపి టిక్కెట్టు బుట్టకు కాకుండా కాంగ్రెస్ లో నుండి టిడిపిలోకి చేరుతున్న కోట్ల సూర్యప్రకాశరెడ్డికి ఇచ్చేస్తున్నారు. ఎంపి టిక్కెట్టు అలా అయిపోయింది. ఇక ఎంఎల్ఏ టిక్కెట్టు విషయంలో అయినా లోకేష్ మాట చెల్లుబాటవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే, ఎస్వీ మోహన్ రెడ్డికి మళ్ళీ టిక్కెట్టివ్వటాన్ని టిజి వెంకటేష్ వ్యతిరేకిస్తున్నారు. ఎస్వీకే టిక్కెట్టిస్తే ఓడిపోవటం ఖాయమని టిజి బహిరంగంగానే చెబుతున్నారు.

 

అందుకే ఎస్వీకి బదులు తన కొడుకు టిజి భరత్ కే టిక్కెట్టివాలంటూ గట్టిగా పట్టుబడుతున్నారు. పట్టుబట్టటమే కాకుండా రేపటి ఎన్నికల్లో తన కొడుకే అభ్యర్ధంటూ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. అలాగే, నియోజకవర్గంలో తన కొడుకుకు మద్దతుగా పార్టీ శ్రేణులతో సమావేశాలు, సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. దాంతో ఎంఎల్ఏగా పోటీ చేయబోయేదెవరో తెలీక టిడిపి నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాలి.

 

 






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: