ఎడిటోరియల్ : వంగవీటి సత్తా ఇంతేనా ? టిడిపిలో కూడా నో టిక్కెట్ ?

Vijaya

తనను తాను బ్రహ్మాండమైన కాపు నేతగా చెప్పుకుంటున్న వంగవీటి రాధాకృష్ణ సత్తాపై పలువురిలో అనుమానాలు మొదలయ్యాయి. వైసిపికి రాజీనామా చేసి రెండు రోజులవుతున్నా తమ పార్టీలో చేరమని ఇంత వరకూ ఏ ఒక్క రాజకీయ పార్టీ నుండి కూడా బహిరంగంగా పిలుపు రాలేదు. నిజానికి తెలుగుదేశంపార్టీని పక్కనపెట్టినా బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు నేతల కొరతతో బాగా ఇబ్బంది పడుతున్నాయి. రాధా వైసిపిలో ఉన్నపుడే తమ పార్టీలో చేరాలంటూ టిడిపి నేతలు బాగా గోకారు రాధాను. తీరా వైసిపికి రాజీనామా చేసిన తర్వాత టిడిపి నుండి అధికారికంగా ఎటువంటి ఆహ్వానము రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సరే 25వ తేదీన చేరటానికి ముహూర్తం పెట్టుకున్నారని అంటున్నారులేండి.

 

ఒకవేళ రాధా గనుక టిడిపిలోకి రావాలనుకుంటే తమ సీటుక ఎసరొస్తుందన్న ఉద్దేశ్యంతో నేతలే అడ్డుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అదే సమయంలో జనసేన నుండి కూడా పిలుపు రాకపోవటం కూడా విచిత్రంగానే ఉంది. ఎందుకంటే రాధా గనుక వైసిపిని వదిలిస్తే జనసేనలో చేరుతారంటూ ఒకపుడు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. పైగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాధా మధ్య బాగా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.  అయినా జనసేన నుండి కూడా పిలుపొచ్చినట్లు లేదు.

 

ఇక బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో నేత కొరత చాలా తీవ్రంగా ఉంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సొస్తే అభ్యర్ధులు దొరక్క పై పార్టీలు నానా అవస్తలు పడటం ఖాయం. అలాంటిది రాదా  వైసిపిని వదిలిపెట్టినా తమ పార్టీలో చేర్చుకుందామని ఏ పార్టీ కుడా ప్రయత్నాలు చెయ్యకపోవటమే విడ్డూరంగా ఉంది. రాధా వ్యక్తిత్వాన్ని తాము భరించలేమనా లేకపోతే రాధాను చేర్చుకున్నందువల్ల ప్రత్యేకంగా వచ్చే లాభమేమీ లేదని అనుకున్నాయో అర్ధం కావటం లేదు.

 

 టిడిపిలో చేరి సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేద్దామని అనుకున్న రాధాకు అక్కడ కూడా చుక్కెదురైందట. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే పరిస్ధితి లేదు కాబట్టి టిక్కెట్టివ్వటం సాధ్యం కాదని రాధాకు చంద్రబాబు తేల్చి చెప్పారట. భేషరతుగా పార్టీలోకి వస్తే ఎంఎల్సీ టిక్కెట్టు ఇస్తానని మాత్రం హామీ ఇచ్చారట. దాంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు ఆఫర్ కు రాధా సరే అని తలూపారని సమాచారం. నిజంగా రాధాది రాంగ్ స్టెప్పే అంటూ ఇపుడు రాజకీయంగా ప్రచారం జరుగుతోంది.

 

వైసిపిలోనే ఉండుంటే గెలుపోటములను పక్కనపెడితే కనీసం విజయవాడ తూర్పు నియోజకవర్గమో లేకపోతే మచిలీపట్నం ఎంపి టిక్కెట్టన్నా దక్కేది. వైసిపి వేవ్ ఉందనే ప్రచారం నిజమే అయితే పై రెండు స్ధానాల్లో రాధా ఎక్కడ పోటీ చిసినా గెలిచుండే వారేమో. అలా కాదని టిడిపిలో చేరాలని అనుకోవటంతో అసలు ప్రత్యక్ష ఎన్నికల నుండే తప్పుకోవాల్సొస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాధాది పూర్తిగా రాంగ్ స్టెప్పే అనే అనుకోవాల్సొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: