ఎడిటోరియల్ : ఫిరాయింపులను వదిలించుకుంటున్నారా ?

Vijaya

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతానికైతే ఇద్దరు ఫిరాయింపు మంత్రులను పక్కన పెట్టేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం చంద్రబాబునాయుడు ఒకటికి పదిసార్లు ఇప్పటికే సర్వేలు చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు సర్వేలు చేయించుకున్నా గెలవరని వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా క్యాండిడేట్లను మార్చబోతున్నారు చంద్రబాబు.  మిగిలిన ఎంఎల్ఏల సంగతి ఎలాగున్నా అలాంటి ఫీడ్ బ్యాక్  ఎక్కువగా ఫిరాయింపుల విషయంలో వస్తోందట. అందులో కూడా నలుగురు ఫిరాయింపు మంత్రుల్లో ఇద్దరిని మార్చటం ఖాయమట.

 

కర్నూలు జిల్లాలో వివాదాస్పద నేతగా ఉన్న భూమా అఖిలప్రియ, కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి గెలిచిన ఆదినారాయణరెడ్డి విషయంలో చంద్రబాబు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వీళ్ళిద్దరి వ్యవహారశైలితో నియోజకవర్గాల్లోనే కాకుండా మొత్తం జిల్లానే కంపు చేసేస్తున్నారు. వారం రోజులుగా కర్నూలు జిల్లాలో అఖిలప్రియ విషయంలో జరుగుతున్న కంపు చూస్తునే ఉన్నారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు జిల్లాకు వస్తే అఖిల సిఎంను కనీసం కలవను కూడా లేదు. అఖిల వైఖరి వల్ల ఆళ్ళగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాలలో కూడా సీనియర్ నేతలంతా బాహాటంగానే ఫిరాయింపు మంత్రిపై తిరుగుబాటే లేవదీశారు. దాంతో పార్టీ బాగా వీకైపోయింది.

 

ఇక జమ్మలమడుగు నియోజకవర్గం పరిస్ధితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదనే చెప్పాలి. టిడిపి సీనియర్ నేత రామసుబ్బారెడ్డితో ఫిరాయింపు మంత్రికి ఏమాత్రం పడటం లేదు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తో పడదు. దానికితోడు వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించినందుకు మంత్రిపై నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత కనబడుతోంది. అసలు పార్టీలోని నేతలే మంత్రికి సహకరించటం లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరిద్దరికే టిక్కెట్లిస్తే టిడిపి ఓడిపోవటం ఖాయమని సర్వే నివేదికలు స్పష్టం చేశాయట.

 

 అందుకనే అఖిల కర్నూలు జిల్లాలో అంత రచ్చ చేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పైగా అఖిల పార్టీ మారిపోతారనే ప్రచారం జరుగుతున్నా నేతలెవరూ కనీసం పలకరించిన పాపాన కూడా పోలేదట. దానికి తగ్గట్లుగానే మంత్రికి కూడా జిల్లా నేతలతో మొదటి నుండి టచ్ లో ఉండే అలవాటు లేదు. అదే అదునుగా నంద్యాల, ఆళ్ళగడ్డలోని మంత్రి వ్యతిరేకులంతా ఏకమయ్యారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక మంత్రి ఉడికిపోతున్నారు. టిడిపి నేతల చెప్పిన విషయం ప్రకారం ఎటూ అఖిల పార్టీ మారిపోతున్నారు కాబట్టే చంద్రబాబు కూడా లెక్క చేయటం లేదంటున్నారు. ఒకవేళ టిడిపిలోనే ఉన్న టిక్కెట్టు దక్కేది అనుమానమే అని అఖిలకు అనుమానం వచ్చిందట.

 

జమ్మలమడుగులో ఫిరాయింపు మంత్రి ఆదికి వేరే సంగతి. నియోజకవర్గంలో గట్టి నేతే. కానీ పార్టీలోనే బద్ద విరోదులుండబట్టి మంత్రి వీకైపోయారు. దానికితోడు నియోజకవర్గంలో ఎటు చూసినా శతృవులే. దాంతో ఆది పోటీ చేస్తే గెలవడని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే ఎంఎల్ఏ టిక్కెట్టు ఇవ్వకుండా కడప ఎంపిగా పోటీ చేయించాలని నిర్ణయించారట. కడప ఎంపిగా పోటీ చేయటం ఇష్టం లేదని ఇప్పటికే మంత్రి చాలాసార్లు  చెప్పారు. అయినా ఎంపిగానే పోటీ చేయించేందుకు చంద్రబాబు డిసైడయ్యారంటే అర్ధమేంటి ? ఆదిని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లే కదా అని పార్టీ వర్గాలంటున్నాయి. చూడబోతే ఫిరాయింపు మంత్రుల్లో ఇద్దరిని వదులు కోవటానికి చంద్రబాబు రెడీ అయినట్లే కనబడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: