సంక్రాంతి తర్వాత వైసీపీ – జనసేన మధ్య ‘పొత్తు’ పొడుపు..!

Vasishta

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఎవరికి ఎప్పుడు శతృవులుగా ఉంటారో.. ఎప్పుడు మిత్రులుగా మారిపోతారో చెప్పడం కష్టం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి శతృవులు, మిత్రులు ఒక్కటవడమో.. విడిపోవడమో చూస్తుంటాం.. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి శతృవులెవరు.. మితృలెవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా జగన్, పవన్ కలిసి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

 

నాలుగేళ్లకు పైగా టీడీపీతో పవన్ కలిసున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచే ఆయన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. వారి తరపున ప్రచారం చేశారు. విడిపోయిన రాష్ట్రానికి న్యాయం చేయాలంటే చంద్రబాబుకు మాత్రం సాధ్యమని బలంగా వాదించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ ను తరిమి తరిమి కొట్టాలన్నారు. అందుకే బీజేపీకి మద్దతిస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రస్తుతం జనసేనాని టీడీపీతో కటీఫ్ చెప్పారు. బీజేపీతో న్యాయం జరగలేదన్నారు. ఆ రెండు పార్టీలూ వద్దంటున్నారు.

 

ఇక జగన్ ఒంటరిపోరాటం చేస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి జనసేన బయటికి రావడంతో ఆ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందనేది పలువురు చెప్తున్న మాట. అయితే జగన్ మాత్రం దీనిపై ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా పవన్ ను నేరుగా టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

పవన్ కల్యాణ్ ఇప్పటికీ చంద్రబాబు తొత్తే అనేది వైసీపీ వాదన. విజయవాడలో జనసేన పార్టీ ఆఫీసు, పవన్ కల్యాణ్ కడుతున్న ఇంటి స్థలం టీడీపీ వాళ్లవేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఇప్పటికీ పవన్ కల్యాణ్ చేస్తున్నారని, ఇదంతా డ్రామా అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. జగన్ కాస్త ముందుకెళ్లి కార్లను మార్చినట్లు పవన్ కల్యాణ్ పెళ్లాలను మార్చుతారని ఎద్దేవా చేశారు. పవన్ ఉచ్చులో పడొద్దని శ్రేణులను హెచ్చరిస్తున్నారు.

 

అయితే ఇవన్నీ పాత విషయాలని, ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ తగ్గిందనేది రెండు పార్టీల నుంచి వస్తున్న సమాచారం. హైదరాబాద్ లో ఇటీవల నాగబాబు నేతృత్వంలో రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు రహస్యంగా సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీని ఓడించాలంటే వైసీపీ, జనసేన కలవక తప్పదని.. కలిస్తే చంద్రబాబును గద్దె దించడం ఖాయమని రెండు పార్టీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చల్లో ఈ మేరకు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలున్నట్టు ఆ పార్టీల నుంచి వస్తున్న సమాచారం. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: