స్పెషల్: దైవ ప్రసాదాన్ని విషంగా మార్చిన పగ - ప్రతీకారం – పదవీలాలస

పగ, ప్రతీకారం, పదవీ లాలస మనిషిని మృగంలా మార్చాయి. పగ, ప్రతీకారం, అధికార దాహంతో దహించుకుపోయే మనిషి, విషయలాలస విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న ఈ నీచ నికృష్ట సమాజంలో ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడు. పగ, ప్రతీకారం, పదవీలాలసతో హత్యలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి దారుణం ఒకటి చోటు చేసుకుంది. పగతో, అధికార దాహంతో రగిలిపోయి ఒక దుర్మార్గుడు ఏకంగా 15 మంది అమాయక భక్తుల ప్రాణాలు తీశాడు 80 మందికి పైగా ఆస్పత్రి పాలైనారు.కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా సుల్వాడి గ్రామంలోని సాలుర్ మఠ్ - "మాలె మహదెశ్వర టెంపుల్ ట్రష్ట్"  మారెమ్మ ఆలయంలో విషం కలిపిన ప్రసాదం తిని 15 మంది భక్తులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.


ఈ ఘటనలో సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విషం ఎలా కలిసింది? అనే మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపు లోకి తీసుకున్న పోలీసులు విచారణలో విస్తుబోయే నిజాలు తెలుసుకున్నారు. ప్రసాదంలో 15 బాటిళ్ళ పురుగుల మందు కలిపినట్టు గుర్తించారు. పగ, అధికార దాహంతో రగిలిపోయిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. బోర్డు సభ్యులతో ఉన్న విభేదాల కారణంగా ఆలయ ట్రస్టు బోర్డు ప్రెసిడెంట్ పన్నిన కుట్ర కారణంగానే ఇంతటి దారుణం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

 

ఈ దారుణానికి ఒడిగట్టింది 52 ఏళ్ల మహదేవ స్వామి. అతను మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కుట్రలో ప్రధాన సూత్రధారి మహదేవస్వామి. ఆలయ మేనేజర్, అతడి భార్య అంబిక, పూజారి దొడ్డయ్య, వంటశాలకు చెందిన ఎర్రన్న పుట్టస్వామి, లోకెష్ కలిసి ప్రసాదంలో పురుగుల మందు కలిపినట్టు పోలీసులు తేల్చారు.

 

సుల్వాడిలోని కిచ్చుగట్టి మారెమ్మ ఆలయ ట్రస్టులో మహదేవస్వామి ప్రెసిడెంట్‌ గా ఉన్నాడు. ట్రస్ట్ ఆదాయ, నిర్వహణ తదితర అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో బోర్డుతో పాటు ఆలయంలోనూ అతని ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్, 2017 వరకు మహదేవ ఆధీనంలో ఆలయం ఉండేది. ఆ తర్వాత ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లడంతో మహదేవ అసంతృప్తితో రగిలిపోయాడు. స్థానిక భక్తులు, గ్రామస్తులు కలిసి ఒక ట్రస్టుగా ఏర్పడి ఆలయ విస్తరణకు పూనుకున్నారు. దీంతో మహదేవ స్వామి ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయింది.


అప్పటిదాకా ఆలయం ద్వారా భారీ ఆదాయం ఉండగా అది చేజారిపోయినట్టైంది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య అంతర్గతపోరు నడుస్తోంది. ఇదే క్రమంలో ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా ట్రస్ట్ సభ్యులు ₹1.5 కోట్లతో గోపురం నిర్మించాలని నిర్ణయించారు. అయితే మహదేవని సంప్రదించకుండానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

దీంతో మహదేవస్వామి బాగా అప్-సెట్ అయ్యాడు. నాతో చెప్పకుండా గోపురం కడతారా? అని ఆగ్రహంతో రగిలిపోయాడు. పగ తీర్చుకునేందుకు సరైన సమయం కోసం వేచి చూశాడు. డిసెంబర్ 14న ట్రస్టు సభ్యులు ఆలయంలో వేడుకను నిర్వహించారు. తనను లెక్కచేయని ట్రస్టు సభ్యులను ఇరికించడానికి ఇదే అనువైన అవకాశంగా భావించిన ప్రసాదంలో విషం కలపాల్సిందిగా ముగ్గురు వ్యక్తులకు మహదేవస్వామి చెప్పాడు. అతని ఆదేశాలతో వారు ప్రసాదంలో పురుగుల మందు కలిపారు. అది తిని 15 మంది చనిపోయారు.

ఆ రోజు ప్రసాదం తిన్నవారిలో 72మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆ రోజు ప్రసాదం తింటున్న సమయంలో కొందరికి కిరోసిన్ వాసన కూడా వచ్చింది. అయినా దేవుడి ప్రసాదం కనుక మౌనంగా ఉండిపోయారు. అదే వారి పాలిట పాపమైంది. భక్తుల మృతిని ఆలయట్రస్టు పైకి తోసేయడానికి మహదేవ కుట్ర పన్నినట్టు పోలీసులు నిర్దారించారు. ప్రసాదం తిన్న భక్తులు అస్వస్థతకు గురైతే పోలీసులు ట్రస్ట్ సభ్యులను అరెస్ట్ చేస్తారని, ఆ తర్వాత ఆలయంపై మళ్లీ తనకే ఆధిపత్యం వస్తుందని మహదేవస్వామి భావించాడు. కానీ కథ అడ్డం తిరిగింది. మహదేవస్వామి పాపం పండి దొరికిపోయాడు. పోలీసులు ఐపిసి సెక్షన్ 304 క్రింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: