ఎడిటోరియల్ : ఆ నియోజకవర్గలో గెలవటమే ప్రిస్టేజిగా మారిపోయింది

Vijaya

జిల్లాలో నియోజకవర్గాలన్నీ ఒకఎత్తు. ఆ ఒక్క నియోజకవర్గం మాత్రం ఒక ఎత్తుగా మారిపోయింది. ఎక్కడ గెలిచి ఓడుతున్నా ఆ నియోజకవర్గంలో గెలుపు మాత్రం అందని ద్రాక్షపండైపోయింది చంద్రబాబునాయుడుకు. సొంత జిల్లాలో సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలవటానికి చంద్రబాబు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. బలమైన ప్రత్యర్ధి వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న నర్ణయంతో వ్యూహాలు రచిస్తున్నారు. 


చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ గెలుపు చంద్రబాబునాయుడుకు అందని ద్రాక్షపండుగా మారిపోయింది. నిజానికి పార్టీ అధినేతలకు తమ సొంత నియోజకవర్గాలు పెట్టని కోటల్లాగ ఉంటాయి. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం సీన్ రివర్సులో నడుస్తోంది. సొంతూరు, సొంత నియోజకవర్గమైన చంద్రగిరిని చంద్రబాబు వదిలేసి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కుప్పంకు వలస వెళ్ళిపోయారు. టిడిపి చివరసారిగా గెలిచింది 1994 ఎన్నికల్లో. ఆ తర్వాత నుండి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరటం లేదు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మూడు ఎన్నికల్లో మాత్రమే టిడిపి ఇక్కడ గెలిచింది. 1983, 1985, 1994లో గెలిచిన టిడిపి ఆ తర్వాత ఎప్పుడూ గెలవలేదు.

 

1994 తర్వాత వరుసగా జరిగిన నాలుగు ఎన్నికల్లో టిడిపికి పరాజయం తప్పలేదు. గల్లా అరుణకుమారి నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. 2014లో వైసిపి అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలిచారు. ఇక్కడ చెవిరెడ్డి బలమైన ప్రత్యర్ధిగా తయారయ్యారు. చెవిరెడ్డి ధాటికి తట్టుకోవటం టిడాపి నేతల వల్ల కావటం లేదు. నియోజకవర్గంలో సమస్యలపై పోరాటాలు చేయటం, ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండటం, అక్కడక్కడ సొంత నిధులు కూడా ఖర్చు చేస్తుండటం లాంటి వాటివల్ల జనాల్లో చెవిరెడ్డి పాతుకపోయారు.

 

ఈ నేపధ్యంలోనే 2019లో చెవిరెడ్డిని ఢీకొట్టే నేతను ఎంపిక చేయటం కోసం చంద్రబాబు నానా అవస్తలు పడ్డారు. మాజీ ఎంఎల్ఏ గల్లా అరుణకుమారి పోటీ చేయటానికి ఇష్ట పడకపోవటంతో కొత్త అభ్యర్ధిని ఎంపిక చేయాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చింది. మొత్తానికి నియోజకవర్గానికే చెందిన పులివర్తి నానిని చంద్రబాబు ఎంపిక చేశారు. టిడిపికి సంబంధించి నియోజకవర్గంలో సమస్య ఏమిటంటే గ్రూపులు చాలా ఎక్కువ. ఒక గ్రూపులోని నేతకు టిక్కెట్టిస్తే మిగిలిన నేతలు పనిచేయరు. ఇఫ్పుడు కూడా అదే జరుగుతుందేమోనని చంద్రబాబు ఆందోళన పడుతున్నారు.

 

చంద్రగిరిలో పోటీ చేయటానికి కనీసం నలుగురు నేతలు పోటీ పడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం రెండు నెలల క్రితమే అభ్యర్ధిగా నానిని ప్రకటించారు. సరే నాని కూడా నియోజకవర్గంలో గ్రూపులన్నింటినీ కలుపుకుని వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారనుకోండి. అయితే, మిగిలిన నేతలు నానికి ఏ మేరకు సహకరిస్తారో అనుమానమే. గ్రూపుల గోలతోనే వరుసగా నాలుగు ఎన్నికల్లో టిడిపి ఓడిపోతోంది. ఏ నేతను చంద్రబాబు అదుపులో పెట్టుకోలేరు, ఎవరిని పార్టీ నుండి బయటకు పంపలేరు. ఎందుకంటే నేతలందరూ చంద్రబాబుకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితులే. మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గమే చంద్రబాబుకు అందని ద్రాక్షపండులాగ అయిపోయింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: