బీజేపీలో అంతర్గత పోరుకు గ్రౌండ్ రెడీ అయిందా..?

Vasishta

ఇంతకాలం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. అనని రాష్ట్రాల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో టఫ్ ఫైట్ ఇచ్చామని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేయవచ్చేమో కానీ పరాభవం పరాభవమే..!! మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగిన సెమీ ఫైనల్స్ లో ఓటమిని బీజేపీ జీర్ణించుకోవడం కష్టమే.! అయితే ఈ ఓటమికి బాధ్యత వహించేదెవరు..? అసలు తిరుగులేదనుకున్న బీజేపీ ఎందుకు ఓటమిబాట పట్టింది..?
  

 ఇప్పుడు అందరి చూపు హస్తిన వైపే ఉంది. మరో నాలుగైదు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల హడావుడి పార్టీల్లో మొదలైపోయింది. తమకు తిరుగే లేదని భావిస్తూ ఆకాశంలో విహరిస్తున్న కాషాయ నాయకత్వాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఫలితాలు ఒక్కసారిగా నేలకు దించాయి. లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు బీజేపీ తంటాలు పడుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న బీజేపీ అసంతృప్తులు మోదీ-షా నియతృత్వ పోకడ పైనా గళం విప్పే అవకాశం కనిపిస్తోంది.

 

ఈ ఎన్నికలు కచ్చితంగా బీజేపీకి ఓ హెచ్చరిక సందేశాన్ని ఇచ్చాయి. మోదీకి ఆకర్షణ ఉన్నా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పటిష్ఠం చేసుకోకపోతే ప్రతికూల ఫలితాలు తప్పవనే సందేశం వెల్లడయింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ పనితీరు సరిగా లేకున్నప్పటికీ ప్రధాని మోదీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదని అనేక సర్వేలు పేర్కొన్నాయి. సంక్షేమ పథకాలను చిలువలు పలువలు చేస్తున్నారన్నది హిందీ రాష్ట్రాల్లో అనేకమంది బీజేపీ నేతల మనోగతం. అయితే మోదీ, అమిత్‌ షాలపై ఉన్న గౌరవం, భయం కొద్దీ వాటిని పార్టీ వేదికలపై ప్రస్తావించడంలేదు. ఈ పథకాలు లక్షిత లబ్ధిదారులకు చేరడంలేదని వారు ధైర్యంగా తమ గళం విప్పేలా తాజా ఎన్నికల ఫలితాలు పురిగొల్పుతాయి.

 

రాహుల్‌గాంధీని పప్పూ అంటూ ఎగతాళి చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. రాహుల్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదనీ, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చారని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు. ఈ ఎన్నికల్లో రాహుల్‌ అద్భుతాలు చేశారని చెప్పలేం. కానీ బీజేపీపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వరమైంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మివిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఇన్నాళ్లూ పప్పూగానే పేరొందిన రాహుల్.. ఇప్పుడు జాతీయస్థాయి నేతగా బదిలీ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్‌ పెట్టేందుకు విపక్షాలను కలుపుకునిపోతే రాహుల్ విజయతీరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

 

మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో మోదీ–షా ద్వయం వ్యూహాలు బెడిసికొట్టాయి. నయానోభయానో ఇన్నాళ్లూ నెగ్గుతూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు రివర్స్ గేర్ మొదలైంది. కచ్చితంగా బీజేపీలో అంతర్గత పోరుకు కూడా ఇవి దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: