పోటీలో 1821 అభ్యర్థులు..అదృష్టవంతులు 119 ఎవరో!

Edari Rama Krishna
నిన్నటి వరకు తెలంగాణలో ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు మధ్యాహ్నంతో తేలిపోతాయి.  ఎవరి మెజార్టీ ఎంత..ఎవరు గెలుస్తారు..ఎవరు ఓడిపోతారు అన్నది.  అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ మాత్రం తమ అభివృద్దిపనులు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని..మరోసారి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తుంటే..ఈసారి టీఆర్ఎస్ ని మట్టి కరిపించాలని టీ కాంగ్రెస్, టిటిడిపి, టీజెఎస్, సిపిఐ మహాకూటమిగా ఏర్పడింది.  మొత్తానికి ఎన్నికల సమయంలో మహామహులు ప్రచారం చేశారు. 

ఈసారి తెలంగాణలో 1821 అభ్యర్థులు పోటీ చేశారు.  ముఖ్య పార్టీలకు సంబంధించిన వారు కొందరైతే..స్వతంత్ర అభ్యర్థులు మరికొందరు. ఇందులో అదృష్టవంతులు కేవలం 119 మంది మాత్రమే. వారు ఎవరన్నది మరో ఐదారు గంటల్లో తేలిపోతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 43 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుంది. ముందుగా సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్ ద్వారా వచ్చిన ఓట్లను అధికారులు లెక్కిస్తారు.

ఈ విధానంలో వచ్చిన ఓటు కవర్ తెరిచిన తరువాత దాన్ని అధికారులు స్కాన్ చేస్తారు. గెజిటెడ్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ ద్వారా వారి సంతకాలను సరిచూస్తారు. ఈటీపీబీఎస్ అనంతరం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది.  తొలి ఫలితం ఉదయం 10.30 గంటల కెల్లా వస్తుందని అంచనా. ఆపై మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి తుది ఫలితం వచ్చేలా చూస్తామని ఇప్పటికే సీఈఓ రజత్ కుమార్ వెల్లడించారు.

అయితే నిన్నటి వరకు ఈవీఎం ల వద్ద భద్రత విషయంలో మహాకూటమి రక రకాల అనుమానాలు వ్యక్తం చేసింది..భద్రత విషయంపై చర్చించింది. మరోవైపు ఈవీఎం ల వద్ద భారీ బందోబస్తు ఉందని..144 సెక్షన్ విధించామని ఎన్నికల అధికారా రజత్ కుమార్ తెలిపారు.  ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపుకార్డు పొందిన వారికి మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: