కేసీఆర్ గుట్టు ఆధారాలతో బయటపెట్టిన రేవంత్..

Chakravarthi Kalyan

ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారంటున్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఆ తప్పుకు ఆయన్ను జైల్లో పెట్టొచ్చని ఆరోపిస్తున్నారు. ఇంతకూ కేసీఆర్ ఆరే చేసిన తప్పేమిటి.. ఆయన ఈ ఎన్నికల్లో సిద్దిపేట నియోజక వర్గంలోని చింతమడకలో ఓటేసిన సంగతి తెలిసిందే.



కానీ కేసీఆర్ తన ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవల్లిలోనూ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు.. దీనికి ఆధారాలుగా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని మీడియా ముందు ప్రదర్శించారు రేవంత్ రెడ్డి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు కోసం నమోదు చేసుకోవడం నేరమని ఆయన చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



సిద్దిపేట నియోజకవర్గంలోని.. చింతమడకలో పార్ట్‌ నం.13, సీరియల్‌ నం.136, ఎపిక్‌ నం.ఎస్‌ఏజి0399691లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తండ్రి రాఘవరావు పేరుతో ఒక ఓటు ఉందని రేవంత్ తెలిపారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి పార్ట్‌ నం.284, సీరియల్‌ నం.655, ఎపిక్‌ నం. వైకెఎం1804400 లో చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల, తండ్రి రాఘవరావు కల్వకుంట్ల పేరుతో.. మరో ఓటు ఉందని తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.



అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రికు రెండు చోట్ల ఓట్లు ఉండటాన్ని నవంబర్ లోనే గుర్తించామని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని.. తాను చింతమడకలోనే ఓటేస్తానని కేసీఆర్ చెప్పడంతో ఎర్రవల్లిలోని ఓటును రద్దు చేశామని ఈసీ అధికారులు చెప్పారు. అయితే అది ఈసీ వెబ్ సైట్ లో అప్‌డేట్ కాలేదని.. అంతకు మించి సమస్య ఏమీలేదని అంటున్నారు. ఓటు రద్దు చేశారు సరే.. అసలు అప్లయ్ చేసుకుంటేనే ఓటు హక్కు కోసం ఇబ్బందులు పెట్టే అధికారులు.. కేసీఆర్ కు రెండు చోట్ల ఓటు హక్కు కల్పించారన్నదే అసలు ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: