బాబు ఖుషీయేనా...!!

Satya
ఓ వైపు తెలంగాణా ఎన్నికల్లో చక్రం తిప్పుతూనే మరో వైపు ఏపీ రాజకీయాలను కూడా ఒడిసిపట్టేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు వంటి వాటిపై ఇప్పటికే ఓ కచ్చితమైన అంచనాకు వచ్చేశారు. తానే కాదు, ప్రత్యర్ధి పార్టీలలో జరుగుతున్న రాజకీయాన్ని కూడా ఓ కంట కనిపెడుతూ  దాన్ని అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏపీలో మరో నాలుగైదు నెలల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించిన  రాజకీయ ముఖ చిత్రాన్ని  బాబు ఇపుడే దగ్గర చూస్తున్నారు. అదే ఆయన రాజకీయ చతురత.


యువ నేతల కొట్లాట :


ఏపీలో రెండు విపక్ష పార్టీలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ఇద్దరూ యువకులే. బాబుతో పోలిస్తే చాలా చిన్న వారే. ఇద్దరికీ ఓపిక ఉంది. రాజకీయాలపై కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏపీలో రేపటి రోజున అధికారంలోకి రావాలని ఇద్దరూ భావిస్తున్న వారే. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబే. కానీ ఆ శత్రువుని కలసి ఎదుర్కోవడంలో మాత్రం ఇద్దరూ ఫెయిల్ అవుతున్నారు. విడివిడిగానే పోరాటం చేస్తున్నారు. అంతటితో కూడా ఆగడంలేదు. బాబు ను వదిలేసి అంత కంటే ఎక్కువగా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. వ్యక్తిగతంగా నిందించుకుంటున్నారు. ఇది ఎంతవరకూ తమకు మేలు చేస్తుందన్నది కూడా చూడడంలేదు.


ఓట్ల చీలిక ఖాయం :


ఏపీలో బాబుపైన మరీ దారుణంగా ప్రజా వ్యతిరేకత లేదు. అదే సమయంలో ఉన్న వ్యతిరేకతను ఎలా పూడ్చుకోవాలో కూడా బాబు తనదైన వ్యూహాలు వేసుకుంటూ పోతున్నారు. ఇక  బాబు కావాలని కోరుకునే వారు ఆయనకే జై కొడతారు, వద్దు అనుకునే వారు మాత్రం పెద్ద ఎత్తున చీలిపోతారు. ఆ ఓట్లు ఇటు వైసెపీకి, అటు జనసేనకు, మరో వైపు బీజేపీ తదితర పార్టీలకు కూడా వెళ్తాయి.  బాబు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన్ని  దించడం అంత తేలిక కాదు. పొత్తులు పెట్టుకోకపోతే అది బాబును పరోక్షంగా గెలిపించడానికే దారి తీస్తుంది. ఈ సంగతి తెలిసి వైసీపీ, తెలియక పవన్ ఇద్దరూ తమలో తాము కొట్లాడుకుంటున్నారు. 
పవన్ రాజకీయం వేరుగా ఉందని కూడా అంటున్నారు హంగ్ అసెంబ్లీ వస్తే కర్నాటక మాదిరిగా ఇక్కడ చక్రం తిప్పాలని ఆయన భావన. అందువల్ల ఆయన పొత్తులకు కలసిరావడంలేదన్న వాదన ఉంది ఇక వైసీపీ అధినేత జగన్ తీరు వేరేగా ఉంది. చంద్రబాబు వ్యతిరేక ఓట్లు గుత్తమొత్తంగా తనకే పడతాయి కాబట్టి పొత్తుల గొడవలు ఎందుకని ఆయన అనుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే స్వభావ రిత్యా కూడా ఈ ఇద్దరు నేతలు కలిసే పరిస్తితి లేదు. ఇది ఓ విధంగా ఏపీలో టీడీపీకే ప్లస్ అవుతుందని అంటున్నారు.


ముందే అంచనా :


బాబు అన్నీ ముందుగానే అంచనా వేసుకున్నారనిపిస్తోంది. బీజేపీ విడిపోయినా హోదా ఇవ్వని పార్టీతో ఎవరూ చేతులు కలపరు. పవన్ టీడీపీని వదిలేసినా అయన, జగన్ కూడా ఎక్కడా పొత్తు పెట్టుకునే చాన్స్ కూడా లేదు. ఇలా బహుముఖ పోటీలు మళ్లీ తనకే అందలం ఎక్కిస్తాయని బాబు ఎపుడో ఒక అంచనాకు వచ్చేశారు. ఇక ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ముందు జాగ్రత్తగా బాబు కాంగ్రెస్ తో కూడా పొత్తు అంటున్నారు. ఎన్నికల సమయానికి వామపక్షాలు వచ్చి చేరినా చేరతాయి. మొత్తానికి రేపటి ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని విధాలుగా బాబు రెడీగా ఉన్నారు. జగన్, పవన్ గొడవలు ప్రస్తుతం ఆయనతో పాటు టీడీపీకి కూడా ఖుషీగానే ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: