ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమికి రంగం సిద్ధమౌతుందా?

మరి నా పుట్టలో వేలు బెడితే నేను కుట్టనా? అనే వాఖ్యంతో ముగిసిపోయే ఏడు చేపల కథ తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విషయం ఈ సందర్భానికి ఎందుకంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధిని, టిజె ఎస్ నాయకుడు కోదండరాం ను, సిపీఐ ని కలుపు కొని తెలంగాణ రాజకీయాల్లో మహాకూటమి ప్రజాకూటమి అంటూ వేలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సరైన గుణపాఠం రానున్న 2019 ఎన్నికల్లో చెబుతామని తెలంగాణా ఆపద్ధర్మ మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గులాబీ పార్టీ వేలు పెట్టక తప్పదని ఆ పరిస్థితిని చంద్రబాబే స్వయంగా సృష్టించారని కెటిఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అదే ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది. ఇక ఓటుకు నోటు కేసు అస్త్రాన్ని తండ్రి తనయులు మరోసారి బూజుదులిపి బయటకు తీసి ప్రచారంలో విస్తృతంగా వాడేస్తున్నారు. ఇప్పటి వరకు కెటిఆర్ ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ నారా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పోటీ చేస్తుందా?  లేక చంద్రబాబు ఆగర్భశత్రువులను ఒకటి చేసి - ప్రత్యర్థులకు సాయం అందించి చంద్రబాబును శంకరగిరి మాన్యాలు పట్టిస్తారా? అనేది ఒక ప్రశ్న. 

ఎవరూ ఊహించని పద్దతిలో ఆ జన్మశత్రువులైన కాంగ్రెస్ - టిడిపిలు జతకట్టి, విజయం నల్లేరు మీద నడక అనుకున్న టీఆర్ఎస్ పై ఇప్పుడు ముప్పేటదాడి చేస్తున్న మహా కూటమి దెబ్బకు టీరెస్ కొంత డిఫెన్సులో పడింది. ఈ పరిస్థితికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు బృందానికి చంద్రబాబు సామాజికవర్గ పునాదులపై దెబ్బకొట్టి నషాళానికి అంటేలా చుక్కలు చూపించాలని గులాబీపార్టీ నిర్ణయించింది.

అందులో భాగంగానే కెటిఆర్ నుంచి ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చాయంటున్నారు. అంతకు మించి దెబ్బగొట్టే ముప్పేట పథకరచన పూర్తయిందని కూడా అభిఙ్జవర్గాల కథనం. అయితే టీఆరెస్ - వైసిపి, జనసేన ల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది?  తెలంగాణ రాష్ట్రం తరహాలో ప్రజాకూటమిని - ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి సృష్టికి టీఆరెస్  ప్రణాళికతో నడుం కట్టొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రధానంగా పవన్, జగన్, ఉభయ కమ్యూనిష్టులను ఒకే తాటి పైకి తేవడానికి గులాబీ బాస్ కేసీఆర్  స్వయంగా రంగంలోకి దిగుబోతున్నారని   జాతీయస్థాయిలో బిజెపి, కాంగ్రెస్ లేని మూడో ఫ్రంట్ కు కుడా ఈ సందర్భంగా తెరతీస్తారని కూడా కెటిఆర్ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో విశ్లేషకులు అంటున్నారు. నారా చంద్రబాబు నాయుణ్ణి రాజకీయంగా అంతం చెసే పనికి వైసిపి సహకారం కేసీఆర్ కు ఎలాను ఉంటుందని పలువురి భావన. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: