నరసాపురం: మెగా ఫ్యామిలీ ఇలాకాలో కాల‌ర్ ఎగ‌రేసేలా ' జ‌నసేన నాయ‌క‌ర్ ' విక్ట‌రీ

RAMAKRISHNA S.S.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇది సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని మొగల్తూరు మెగా ఫ్యామిలీ స్వగ్రామం కావటం విశేషం. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజుకు సైతం మొగల్తూరు స్వగ్రామం. నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం మున్సిపాలిటీ తో పాటు.. నరసాపురం, మొగల్తూరు మండలాలు విస్తరించి ఉన్నాయి. అటు గోదావరి, ఇటు సముద్రం ఒడ్డును ఆనుకుని ఈ నియోజకవర్గంలో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది.

ఆ తర్వాత శెట్టిబలిజ, మత్స్యకార సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. అయితే అనూహ్యంగా గతంలో కాంగ్రెస్‌లో ఉన్న.. ఇప్పుడు వైసీపీలో ఉన్న.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముదునూరి ప్రసాద్ రాజు ఇక్కడ రాజకీయంగా బలపడ్డారు. పొత్తుల‌ నేపథ్యంలో ఈ సీటును టీడీపీ, జనసేనకు త్యాగం చేసింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి కేవలం 5000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన బీసీ నేత బొమ్మిడి నాయకర్‌కు.. మరోసారి పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీల పొత్తుతో పాటు బీసీ, కాపు సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం.. ఇక్కడి నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఒకసారి నరసాపురం ఎంపీగా గెలిచిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఎన్నికలకు ముందు జనసేనలో చేరటం.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు కలిసి.. కసితో పని చేయడంతో ఈసారి కచ్చితంగా జనసేన భారీ మెజార్టీతో గెలిచే సీట్లలో నరసాపురం ఒకటన్న అంచనాలు ముందే వచ్చేసాయి. ప్రచారంలోనే వైసీపీ అభ్యర్థి ముదునూరు ప్రసాద్ రాజుకు కూడా తాను గెలుస్తాం అన్న అంచనాలు లేవని వైసీపీ వాళ్ళే చర్చించుకున్నారు. ఇక్కడ వార్‌ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందని అందరూ భావించారు.

ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో నాయ‌క‌ర్‌కు ఏకంగా 49 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీ ద‌క్కింది. దీంతో గ‌తంలో ప్ర‌జారాజ్యం, గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన వ‌ల్ల త‌మ సొంత ఇలాకాలో ద‌క్క‌ని విజ‌యం ఈ రోజు ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన రూపంలో మెగా ఫ్యామిలీకి ద‌క్కిన‌ట్ల‌య్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: