కూట‌మి 20 నెల‌ల పాల‌న‌: వైసీపీకి వాయిస్ లేకుండా చేశారే.. ?

RAMAKRISHNA S.S.
ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల్లోకి వెళ్లడానికి, తమ వాదనను బలంగా వినిపించడానికి స్పష్టమైన 'వాయిస్' చాలా ముఖ్యం. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పరాజయం పాలైనప్పటి నుంచి.. ఆ పార్టీలో ఒకరకమైన స్తబ్దత కనిపిస్తోంది. గత 20 నెలలుగా (జూన్ 2024 నుంచి జనవరి 2026 వరకు) పార్టీ గమనాని పరిశీలిస్తే, నిర్మాణాత్మకమైన వాయిస్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


మారని అధినేత వైఖరి - వివాదాస్పద వ్యాఖ్యలు :
ఎన్నికల ఓటమి తర్వాత కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన శైలిని మార్చుకోలేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మిర్చి, పత్తి రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే, "ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది" వంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి లేదా ప్రజా సమస్యల కంటే సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం పార్టీ గ్రాఫ్‌ను తగ్గించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


వాయిస్ కోల్పోయిన నేతలు :
నియోజకవర్గాల్లో పార్టీని కాపాడుకోవాల్సిన నేతలు ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా "కాంట్రాక్ట్ సంస్థలను జైలుకు పంపిస్తాం" అనడం పెట్టుబడిదారుల్లో మరియు పార్టీ శ్రేణుల్లో ప్రతికూల ప్రభావం చూపింది.


రాజధానిపై రివర్స్ గేర్ :
ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని వేగంగా అభివృద్ధి చేస్తోంది. ప్రజల్లో కూడా దీనిపై సానుకూలత కనిపిస్తున్న సమయంలో, జగన్ ఇంకా పాత వాదనలకే పరిమితమవ్వడం వల్ల పార్టీ వాయిస్ ప్రజలకు చేరడం లేదు. ప్రజలంతా ఒక దారిలో వెళ్తుంటే, పార్టీ రివర్స్‌లో వెళ్లడం వల్ల క్షేత్రస్థాయిలో నాయకులు తమ వాదనను వినిపించలేకపోతున్నారు. భ‌విష్య‌త్తులో అయినా వైసీపీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుని, ప్రజల సమస్యలపై నిర్మాణాత్మకమైన వాయిస్ వినిపిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: