ఆచంట : పితాని ప‌ట్టు ప‌ట్టేశాడు... జ‌గ‌న్ పార్టీని మ‌డ‌త పెట్టేశాడు... మంత్రి కూడానా..?

RAMAKRISHNA S.S.
పశ్చిమగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి అడ్డాగా ఉన్న ఆచంట నియోజకవర్గంలో.. ఈసారి అధికార వైసీపీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నుంచి ఇద్దరు మాజీ మంత్రుల‌ ఉత్కంఠ భరితమైన పోరు నడిచిందనే చెప్పాలి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేశారు. వీరిద్దరూ పాత పరిచయస్తులే కావడం విశేషం. గత ఎన్నికలలో అప్పుడు మంత్రిగా ఉన్న పితానిపై గెలిచిన రంగనాథరాజు.. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రి అయ్యారు. ఆచంట నియోజకవర్గంలో ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ మండలాలతో పాటు.. పూడూరు మండలంలో కొన్ని గ్రామాలు విస్తరించి ఉన్నాయి.

నియోజకవర్గంలో శెట్టిబలిజ‌ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. వీరి ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఎస్సీ ఓటర్లు ఉంటారు. అలాగే కాపు సామాజిక వర్గ ప్రాబల్యం కూడా చాలా వరకు ఉంది. గత ఎన్నికలలో నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీలు కూడా ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూప్పారు. అందుకే ఓసి వర్గానికి చెందిన రంగనాథరాజు పితానిపై విజయం సాధించారు. అప్పుడు మంత్రి గా ఉన్న పితానిని ఓడించిన వెంట‌నే జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వంలో క్ష‌త్రియ కోటాలో రంగ‌నాథ రాజుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఈసారి పితాని రంగనాథరాజును ఓడించాలని కసితో పని చేశారు. ఎన్నికలకు ముందు ప్రచారం పోలింగ్ సరళిన్ని బట్టి చూస్తే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం లో అన్ని సీట్లలో కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందన్న అంచనాలు వచ్చినా.. ఆచంటలో మాత్రం గట్టి పోటీ తప్పదనే అంచనాలు ఎక్కువగా నిలబడ్డాయి. ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో పితాని స‌త్య‌నారాయ‌ణ ఏకంగా 26 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక పితాని చంద్ర‌బాబు కేబినెట్లో బీసీ శెట్టిబ‌లిజ కోటాలో మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: