నల్లగొండలో కోమటిరెడ్డికి పెద్ద షాక్!

Edari Rama Krishna
తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్ది  పోటీల్లో నిల్చున్న అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.  తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయా పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతున్నారు.  అయితే ఏ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు జంప్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.  తాజాగా నల్లగొండలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.  నల్లగొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌కు టాటా చెప్పి  కారు ఎక్కనున్నారు. వరసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఉన్న చిలకల గోవర్ధన్‌తో పాటు మరో సీనీయర్ నేత, ప్రముఖ న్యాయవాది ధరనికోట రాము నేడు ఆపద్దర్మ మంత్రి కల్వకుంట్ల రామారావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధంపుచ్చుకొనున్నారు. 

 ఆపద్ధర్మ మంత్రి జగదీష్‌ రెడ్డి మంతనాలతో ఈ ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి ఉద్యమాల నుండి ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో ధరనికోట రాము క్రియాశీలక పాత్ర పోషించారు. దివంగత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.  హైదరాబాద్‌లోని సంజయ్ గాంధీ పాలిటెక్నీక్ కళాశాల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం  జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటూ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  ప్రధాన అనుచరుడిగా పార్టీలో ధరనికోట రాము మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకేసారి ఇద్దరు కారు గూటికి చేరడంతో టీఆర్ఎస్ అభ్యర్థి కంచెర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీ వలసలు వచ్చిపడుతున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: