ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు


రాజకీయం బహు విచిత్రం. ఎంతటివారైనా అవకాశం దొరగ్గానే సిద్ధాంతాలకు, విధానాలకు తిలోదకాలిచ్చి దాని చక్రబంధంలో ఇరుక్కొని విలవిలలాడాల్సిందే. చంద్ర బాబా!  రాహుల్ బాబా! చివరికి ప్రొఫెసర్ కోదండరాం గారా! ఎవరైనా రాజకీయం ముందు పాదాక్రాంతులే. ఇందులో ఎవరూ పత్తిత్తులు కానేకారు. కేవలం నాలుగు శాసనసభ స్థానాలకోసం  తెలంగాణా జన సమితి - టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ: కోదండరాం గాంధీ భవన్‌ మెట్ల మీద పొర్లు దండాలు పెడుతున్నారని తెలంగాణా అపద్ధర్మ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. 

నాలుగు సీట్ల కోసం కోదండరాం ఫీట్లు చేస్తూ అటు అమరావతికి, ఇటు ఢిల్లీకి గులాంగిరీ చేయటానికి సిద్దపడ్డారని మండిపడ్డారు.  చంద్రబాబు వ్యూహం ప్రకారమే ప్రొ: కోదండరాంను మహాకూటమి కమిటీ చైర్మన్‌ గా నియమించారని ఆరోపించారు. టీడీపీని తెలంగాణ ద్రోహి అన్న కోదండరాం ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారో? చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ లు ప్రొ: కోదండరాం ను టార్గెట్‌ చేస్తే, టీఆర్‌ఎస్‌ ఆయనను కంటికి రెప్పలా కాపాడిందని అన్నారు. పాత రోజులను ఆయన ఒక సారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ప్రొ: కోదండరాం గత ఉద్యమ కాలం నాటి పాత పేపర్లు వెతికి ముందేసుకోని ఒక్కసారి చూసుకోవాలని అన్నారు. సంగారెడ్డికి చెందిన టీజేఎస్‌ నేత నగేశ్‌, ఆయన అనుచరులు, ప్రైవేట్‌ ఉద్యోగ సంఘ నేతలు సోమవారం హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ, జేఏసీని విచ్ఛిన్నం చేయాలని చూసిన కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రొ: కోదండరాం దగ్గరయ్యారని విమర్శించారు. 

నాడు తన నోటితో తానే తిట్టిపోసినవారు ఇప్పుడు ప్రొ: కోదండరాం కు మంచివారయ్యారని, రక్షణ కవచంలా నిలిచిన టీఆర్‌ఎస్‌ చెడ్డది ఎలా అయిన్దన్నారు? కోదండరాం రంగులు మార్చిన వైఖరిని ఎండగడుతామని అన్నారు.  కాంగ్రెస్‌ గెలవలేని సీట్లను కోదండరాంకి ఇస్తుందని ఆరోపించారు. ప్రొ: కోదండరాం నిజస్వరూపాన్ని త్వరలోనే బయట పెడతామని అన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలవ బోతున్దని ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: