లోకేష్ జీ ! సీఎం రమేష్ కు నామినేషన్ పై యిచ్చిన పనుల మాటేమిటి? ఐటి సోదాల దరిమిలా ప్రజల్లో చర్చ?

నామినేషన్ పై  ఒక కాంట్రాక్టరుకు పనులు ఇవ్వటం తప్పు. అయితే కొన్ని అనివార్య సందర్భాల్లో ఐతే ఎక్కువలో ఎక్కువ పది లక్షల రూపాయలకు మించిన పనులు నామినేషన్ పై ఇవ్వటానికి నిబంధనలు అందుకు అంగీకరించవు. కారణం ఇది ప్రజాస్వామ్యం. ఏ వ్యక్తి చక్రవర్తి కాదు. ఆఖరికి ప్రధాని ఐనా, ముఖ్యమంత్రి అయినా అందే. మహా ఐతే  కొంత డిగ్రీ డిఫరెన్స్ ఉండవచ్చు.

 టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు చెందిన కొన్ని కంపెనీలకు ముఖ్యంగా రిత్విక్ ప్రోజెక్ట్స్ కు ఏకంగా చంద్రబాబు సర్కారు ₹ 1156 కోట్ల రూపాయల విలువ చేసే పనులను నామినేషన్ పై అప్పగించింది. అది కూడా మెమోల ద్వారానే. "జలయజ్ణం ధనయజ్ణమే" అని టీడీపీ నేతలే స్వయంగా ఆరోపించిన వైఎస్ హయాంలో కూడా ఇంత బరితెగింపు కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని 'స్కాముల స్వామ్యం' ఏలా చేశారో ఒక్క సాగునీటి శాఖను పరిశీలిస్తే సరిపోతుంది.


హంద్రినీవా ఫేజ్-2 లో 2,4,5,6 ప్యాకేజీలకు సంబంధించిన ₹ 1000 కోట్ల రూపాయల పనులను నామినేషన్ పైనే సీఎం రమేష్ కంపెనీలకు కట్టబెట్టారు. దీంతో పాటు గాలేరు-నగరి లో  ₹ 156 కోట్ల రూపాయల విలువ చేసే 26 ప్యాకేజీ పనులను కూడా నామినేషన్ పైనే ఇచ్చారు. వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై ఇవ్వటం అంటే ప్రజాస్వామ్యం తన కిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చెయ్యటం తప్ప మరేమీ కాదని సాగునీటి శాఖ అంతర్గత ఉద్యోగ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

 


ఇవి కాకుండా టెండర్ల ద్వారా సీఎం రమేష్ కంపెనీలు సాగునీటిశాఖలో భారీఎత్తున పనులు దక్కించుకుంది. అసలు ముఖ్యమంత్రి ఏపీలో "టెండర్ల వ్యవస్థ" నే అపహస్యం చేస్తూ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై ఇవ్వటం ద్వారా అక్రమలబ్ది పొందేందుకు తన మంత్రివర్గ సహచరులకు చెందిన లేదా వారి నేపధ్యమున్న అనేక సంస్థలకు మెళ్ళు చేయటం జరుగుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాయి.

సీఎం రమేష్ ఆయన సన్నిహిత వర్గాల ఇళ్ళపై సంస్థలపై ఆస్తులపై ఐటి దాడులు ప్రారంభం కాగానే, ఎప్పుడూ జరిగుతున్నట్లే టీడీపీ ఐటి శాఖామాత్యులు ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా  స్పందించారు. "కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేసి నేటికి వంద రోజులు పూర్తయినా, కేంద్రం లో చలనం లేదు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా చెయ్యాలి అని రాష్ట్రం లోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై ఐటీ శాఖతో ప్రధాని దాడులు చేయిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము మాత్రం ప్రత్యేక హోదా సాధనలో వెన్నక్కి తగ్గేది లేదు" అని నరెంద్ర మోడీకి వార్నింగ్ యిచ్చారు.

 

 మోడీ ఆపరేషన్ గరుడ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై దాడికి కారణం, ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన 18హామీలు నెరవేర్చాలి అని సిఎం రమేష్ నిలదీసినందుకే నని - దాని మీదే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పై పగ పట్టారు. మొన్న బీద మస్తాన్ రావు, నిన్న సుజనా చౌదరి, నేడు సిఎం రమేష్ సంస్థలపై దాడి చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే బీద మస్తాన్ రావు, సుజనా చౌదరి,సిఎం రమేష్ లు మాత్రమే నని అర్ధం ద్వనించటంతో అమరావతి ప్రజలు లోకెష్పై సెటైర్లు వేస్తూ నవ్వుకోవటం కనిపించింది. 

 

"కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు" అన్నంత మాత్రాన్నే సిఎం రమేష్ సంస్థలపై ఈ ఐటీ దాడులు" అంటూ వ్యాఖ్యానించిన లోకేష్ ను - మరి జరిగిన ఆర్ధిక నేరాల  మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. సీఎం రమేష్ కంపెనీకి ₹ 1156 కోట్ల రూపాయల పనులను నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వం అంటే తమ సొంత కంపెనీ అన్నట్లుగా అస్మదీయులకు పనులు కాంట్రాక్టులు నామినేషన్ పద్దతిలో కేటాయించటం కూడా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమేనా? అసలు అది కరక్టా? దీనిపై కూడా లోకేష్ కాస్త వివరణ ఇస్తే బాగుండేది కదా? అంటున్నారు ప్రజలు.

 

ఒక వైపు ఐటి దాడులు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం జంక కుండా నదుల అనుసంధానం పేరుతో "గోదావరి-పెన్నా అనుసంధానం" అంటూ కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ లను ఎక్సెస్ 300% పై రేట్లతో అస్మదీయ కంపెనీలైన నవయుగా, మెగా ఇంజనీరింగ్ లకు కట్టబెట్టడానికి రెడీ అయిపోయారు. ఇవి ఎవరి ప్రయోజనాల కోసం? మరివన్నీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులపై కక్షతో ప్రధాని నరెంద్ర మోడీ స్వయంగా సృష్టించారా? అంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు ఆంధ్రాజనం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: