పెద్దబండేసి మోదిన నితిన్ గడ్కరి: మోడీ - షాలకు తల నొప్పి - కాంగ్రెస్ చేతికి బ్రహ్మాస్త్రం

అనాలోచితంగా ఆయాచితంగా అశువుగా నోటికి తోచింది మాట్లాడేసెయ్యటం బిజెపి నేతలకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య. వారికి శత్రువులకంటే స్వయంగా వారే అపకారం చేసుకుంటుంటారు. బస్మాసుర హస్తం అంటే కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే బిజెపి నేత్తిపై బస్మాసురహస్తం తనకు తనే పెట్టేశారు ఒక సీనియర్ బిజెపి నేత. ఇక అసలే బిజెపిపైకి కోతిలా లంఘించే రాహుల్ గాంధికి కల్లు తాగి ఆపై నిప్పు తొక్కిన ఆనందంతో ఎగిరిపడే అవకాశం ఇచ్చారా నాయకుడు. ఇంకేం అంతా చిందర వందర గందర గోళం వార్తలన్నీ కిష్కింధకాండే. 
  

2014 లో ఆచరణకాని హామీల నిచ్చి బిజెపి అధికారంలోకి వచ్చింది: బిజెపి సీనియర్ నేత నితిన్ గడ్కరి సంచలనం  — ప్రఖ్యాత ప్రజాదరణ ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక  "కలర్స్‌ చానల్‌" లో ప్రసారమైన అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే  అనే రియాలిటీ షో లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌ తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన నానా తో సంభాషిస్తూ నితిన్‌ గడ్కరీ బీజేపీ ని అత్యంత పాశవికంగా ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు.


ఈ నెల 4, 5 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారమైంది. రాజకీయాలు సినిమా కలిసిన వేళ అనే పేరుతో మొదటి భాగం, నానా-నితిన్‌ మధ్య చమత్కారం పేరిట రెండో భాగం ఈ కార్యక్రమం ప్రసారమయింది.  అయితే అత్యంత అనుభవఙ్జుడు నేటి కేంద్రమంత్రి కూడా అయిన నితిన్‌ గడ్కరీ తన సొంత బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్నే తీవ్ర ఇరకాటంలో పడేశారు. కాషాయాన్ని కషాయంగా మార్చి దానిపై విరుచుకు పడుతున్న కాంగ్రెస్‌ చేతికి గడ్కరీ తానే స్వయంగా మరో శక్తివంతమైన అస్త్రాన్ని అందించారు.


నితిన్ గడ్కరీ వ్యాఖ్యలతో నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయమే కాదు మొత్తం కాషాయవాదులంతా ఒక పక్కన తలలు పట్టుకుంటుంటే, మరోపక్క కాంగ్రెస్‌ దీన్ని అదునుగా అవకాశంగా బావించి ధారుణంగా తూర్పారబడుతోంది.

 

అసలు గడ్కరీ ఏమన్నారంటే: బీజేపీ అధికారంలోకి రావడానికి "ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని - అసలు తాము అధికారంలోకి రాగల నమ్మకం లేకపోవటమే దాని కి కారణమనే అర్ధం ద్వనించింది. ఆవిషయం కూడా దాపరికం లేకుండా చెప్పేశారు. ఆ హామీలు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించాయని, వాటిని నెరవేర్చే ప్రయత్నమే జరగలేదని నిష్కపటంగా ఒప్పుకున్నారు.

 

"నాడు మేం అధికారంలోకి రాగలమన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు గుప్పించా లని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీ లను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నాం!" అని 2014 ఎన్నికల ముందు, ఇప్పటి పరిస్థితుల గురించి నితిన్ గడ్కరీ కుండ బద్దలు కొట్టారు.

 

"ఒకవేళ అధికారంలోకి రాలేకపోతే ఇచ్చి హామీలతో సంబంధమే ఉండదు గాదా!" అని భావించా మంటూ తన స్వంత బిజెపి ధోరణిని చెప్పకనే చెప్పారు. "కానీ, ప్రజలు తమకు అధికారం కట్ట బెట్టడంతో అసలు సమస్య వచ్చిపడింది" అని సరదాగా వ్యాఖ్యానించారు.

 

అయితే గడ్కరీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం గురించి చేశారా? అనే విషయంలో ఇక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలతో పారదర్శకంగా, తెరిచిన పుస్తకంలా ఉండే పార్టీ అవసరం ఎంతో ఉందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

 

ఈ షోలో నితిన్ గడ్కరీ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేఅకర్ మాత్రం ఆచి తూచి స్పందించారు. కేవలం తన కుటుంబం గురించి మాట్లాడి ఊరుకున్నారు. కీలక స్థానం లో ఉన్న ఒక అత్యంత సీనియర్ బీజేపీ నేత సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఇదే మొదటి సారి కాదు. గతంలో పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర కేబినెట్‌ లో ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగిన మంత్రి ఒక్కరైనా లేరని ఆయన మండి పడ్డారు.

 

నితిన్ గడ్కరీ విషయానికొస్తే: ఆయన వ్యాఖ్యలు ఉన్న వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ లో పోస్టు చేశారు. "నిజం చెప్పారు. బీజేపీ అధికారం లోకి రావడం కోసం తమ కలల్ని, నమ్మకాన్ని వాడుకుందని ప్రజలు కూడా భావిస్తున్నారు" అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధి ట్వీట్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వంచన, అబద్ధం,  హామీలతో ఏర్పడిందన్న తమ అభిప్రాయంతో బిజెపి నితిన్ గడ్కరీ ఏకీభవించారని కాంగ్రెస్‌ పార్టీ మరో ట్వీట్‌ లో వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: