కామంతో మంచం కోరితే అది లంచమై కొంప ముంచే కాలం వచ్చింది

కామంతో తల కెక్కితే ఙ్జానం పలాయనం చిత్తగిస్తుంది. అందుకే కామాతురాణం నః భయం నః లజ్జ అంటారు. కామంతో దహించుకు పోయే వ్యక్తికి భయం గాని సిగ్గుగాని ఉండవని అర్ధం.  ప్రస్తుత పరిస్థితుల్లో పలు సందర్భాల్లో వినిపిస్తున్న విషయం "లైంగిక ప్రలోభం ఆశించి ఏదుటివారికి వారి అవసరానికి సహకరించి లొంగ దీసుకోవటం" చూస్తూనే ఉన్నాం. ఈ దుర్వ్యసనం ఇందుగలదు, అందులేదని సందేహం అక్కరలేదు. 


ఒకరకంగా ఇది క్విడ్ ప్రో కో అంటే నీకిది నా కది  అనే లాగా అందించిన ప్రయోజనానికి ప్రతిఫలం కోరటం, అంటే లంచం కోరటం కిందికే వస్తుంది. ముఖ్యంగా అనేక ప్రభుత్వ,  ప్రభుత్వేతర కార్యాలయాల్లో  "సహోద్యోగిని" పై గాని, అవసరార్ధం కార్యాలయాలకు వచ్చిన వారికి, ఏదైనా పనిని ఒకరికి అనుకూలంగా చేసి పెట్టేందుకు ప్రభుత్వోద్యోగి డబ్బు రూపేణా లబ్ధి పొందడం - 1988 నాటి అవినీతి నిరోధకచట్టం ప్రకారం (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌) అవినీతి అంటారు.  

1998నాటి అవినీతి నిరోధక చట్టంలో అవినీతి అంటే, ఏదైనా పనిని ఒకరికి అనుకూలంగా చేసి పెట్టేందుకు ప్రభుత్వోద్యోగి డబ్బు రూపేణా లబ్ధి పొందడం అని అంటారని ఒక సీనియర్‌ ప్రభుత్వాధికారి తెలిపారు.  

అయితే ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు "లంచం" క్రింద బహుమతి లేదా ఇతర ఏర్పాట్లు అంటే - విలాస వినోద ప్రయాణాలు, అతిది మర్యాద సంబదిత లబ్ధి (హోటల్ స్టే మొదలైన), బహుమతులు, పబ్బులు, క్లబ్బులు మొదలైన విలాసాలనందించే సంస్థల్లో సభ్యత్వాల రూపంలోనే కాకుండా లైంగిక ప్రయోజనం అంటే "మంచం" కోరుకున్నా, "లంచానికి బదులు మంచంవేసినా"  - అది అవినీతి కిందకే  వస్తుందని - "లైంగిక లబ్ధి" కి ఏడేళ్ల దాకా జైలు శిక్ష ఉంటుందని "అవినీతి నిరోధక సవరణల చట్టం - 2018"  స్పష్టం చేస్తోంది. 

‘2015 నవంబరులో మోదీ సర్కారు "లా-కమిషన్‌" కు బాధ్యతలు అప్పగించగా, 2016లో పార్లమెంట్‌ లో చట్ట సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జూలైలో దానికి రాష్ట్రపతి రాజముద్ర పడింది’ అని వివరించారు. 


తాజా సవరణల ప్రకారం - ఒకరికి అనుకూలంగా పని చేసేందుకు ప్రభుత్వోద్యోగులు, అధికారులు ప్రతిఫలంగా: 


*స్థిర, చరాస్తుల కొనుగోళ్ళు లేదా తోలివిడత వాయిదాలు అంటే డౌన్ పేమెంట్లు ద్వారా ప్రయోజనం పొందినా.. 
*బంధుమిత్రులకు ఉద్యోగం వచ్చేలా చేసినా.. 
*ఖరీదైన విలాసవంతమైన వస్తువులను స్వీకరించినా.. 
*బదులుగా లైంగిక సాంగత్యాన్నిలేదా లైంగిక లబ్ది కోరినా, పొందినా...


ఆ చర్యలు అవినీతి కిందకు వస్తాయి. అంటే వృత్తి పరంగా చేయవలసిన పని అవతలి వారికి అనుకూలంగా మార్చి చేసి పెట్టి లైంగిక సేవల్ని కోరడం, దాన్ని అంగీకరించి పనులు చేయడమూ ఇకపై లంచంగానే పరిగణించవలసి వస్తుంది. ఈ నేరం కింద ఏడేళ్ల జైలు శిక్ష అని చట్టం చెపుతుంది.

తాజాగా అమలులోకి వచ్చిన అవినీతి నిరోధక సవరణ చట్టం-2018 ప్రకారం అనుచిత ప్రయోజనం ఏరకంగా పొందడం జరిగినా అది శిక్షార్హమైన నేరమే ఔతుంది.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అమోదముద్ర అంటే సవరణపై సంతకం చేయడంతో ఈ కొత్త చట్టాన్ని కేంద్రప్రభుత్వం 2018 జులై నుంచి అమలు లోకి తెచ్చింది. దాంతో 1988 నాటి 30ఏళ్ల అవినీతి నిరోధక చట్టానికి సవరణల ద్వారా కొత్త శక్తి ని అందించినట్లయింది.

కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా ప్రలోభాలకు గురైనా శిక్షార్హులౌతారు. లైంగిక ప్రలోభాలకు లొంగడం, విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ఇతరత్రా ఖరీదైన ఆతిథ్యాలు పొందడం తదితరాలకు పాల్పడిన ప్రభుత్వోద్యోగులపై కేంద్ర దర్యాప్తు బృందం (CBI) కేసులు పెట్టనుంది. బంధువులు, స్నేహితులు ఇతరులకు ఉద్యోగాలు కల్పించి అనుచిత ప్రయోజనం పొందే ప్రభుత్వోద్యోగులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు.

కొత్త చట్టం ప్రకారం నగదు రహిత బహుమతులు పొందినా లంచం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఒకరు తెలిపారు. అదేవిధంగా విహారయాత్రలకు విమాన టిక్కెట్లను పొందడం, ఇతరత్రా ఉచిత సేవల్ని పొందడం తదితరాలు కూడా లంచం కిందకే రానుంది.  అనుచిత ప్రయోజనం అనే పదం రాబోయే రోజుల్లో మరింత విస్తృత రూపం సంతరించుకుని ఈ చట్టం అమలుకు తోడ్పడనుందని న్యాయశాస్త్ర నిపుణుడు సిమ్రాన్‌జీత్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: