ఎడిటోరియ‌ల్ః ఏపిలో రాష్ట్ర‌ప‌తి పాల‌నా ? ఆందోళ‌న‌లో దేశం నేత‌లు

Vijaya
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాష్ట్ర‌పతి పాల‌న విధించ‌నున్నారా ?   తెలుగుదేశంపార్టీ నేత‌లు అదే అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ను క‌ల‌సిన రాష్గ్ర బిజెపి నేత‌లు రాష్ట్ర‌పతి పాల‌న‌కు సిఫార‌సు చేయాలంటూ  చేస్తున్న‌డిమాండ్ తో టిడిపి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. మొత్తానికి రాష్ట్రంలో శాంతి  భ‌ద్ర‌త‌లు దాదాపు ప‌డ‌కేశాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం కూడా టిడిపి నేత‌ల ఆందోళ‌న‌ను పెంచేస్తోంది.

టిడిపి-బిజెపి సంబంధాలు ఉప్పు-నిప్పు


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, ఎన్డీఏలో నుండి తెలుగుదేశం పార్టీ బ‌య‌ట‌కు వ‌చ్చేసిన ద‌గ్గ‌ర నుండి రెండు పార్టీల మ‌ధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులాగ త‌యారైంది. అభివృద్ధి విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వంలోని బిజెపి నేత‌ల‌ది ఒక‌మాట కాగ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపిది మ‌రోమాట‌గా సాగుతోంది.  వివిధ కార్య‌క్ర‌మాల‌కు కేంద్రం భారీ ఎత్తున నిధులు ఇస్తోందంటూ ఏపి బిజెపి నేత‌లు చెబుతుంటే, అస‌లు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని టిడిపి నేత‌లు ఎదురుదాడి చేస్తున్నారు.

చంద్ర‌బాబుపై బిజెపి అవినీతి ఆరోప‌ణ‌లు


అదే స‌మ‌యంలో కేంద్ర‌ప‌థ‌కాల అమ‌లులో చంద్ర‌బాబునాయుడు భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్లు బిజెపి నేత‌లు తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఏ ఏ ప‌థ‌కంలో ఎంతెంత అవినీతి జ‌రిగింద‌నే విష‌యాన్ని బిజెపి నేత‌లు మీడియా స‌మావేశాల్లో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. నాలుగేళ్ళ‌పాటు మిత్ర‌లుగా ఉండి శ‌తృవులుగా మారిన పార్టీలు క‌దా ?  దానికితోడు త్వ‌ర‌లో ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. టిడిపి-బిజెపి రెండు కూడా ఒక‌దాన్ని మ‌రొక‌టి జ‌నాల ముందు గ‌బ్బు ప‌ట్టించేందుకు అందుబాటులో ఉన్న ప్ర‌తీ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటున్నాయి. 


బిజెపిని గ‌బ్బుప‌ట్టిస్తున్న చంద్ర‌బాబు


నిజానికి చెప్పాలంటే గ‌బ్బు ప‌ట్టించే విష‌యంలో ఒక విధంగా చంద్ర‌బాబే స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. టిడిపికి రాష్ట్రంలో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉండటం, అధికారంలో ఉండ‌టానికి తోడు  80 శాతం మీడియా  చెప్పుచేత‌ల్లో ఉండ‌టం చంద్ర‌బాబుకు బాగా క‌ల‌సి వ‌చ్చింది. కేంద్రంలో అధికారంలో ఉంద‌న్న మాటే కానీ పై విష‌యాల్లో టిడిపి ముందు బిజెపి తేలిపోయింది. 


బిజెపి నేత‌ల‌పై టిడిపి దాడులు


ఈ నేప‌ధ్యంలో అక్క‌సుతో బిజెపి శ్రేణులు టిడిపి నేత‌ల‌పై భౌతిక‌దాడుల‌కు దిగారంటే అర్ధం చేసుకోవ‌చ్చు. కానీ  టిడిపి శ్రేణులే బిజెపి నేత‌ల‌పై భౌతిక‌దాడులు చేస్తుండ‌టం విచిత్రంగా ఉంది. నెల్లూరు జిల్లా కావ‌లిలో ర్యాలీ సంద‌ర్భంగా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పై చెప్పుల‌తో దాడి జ‌రిగింది. అంతకుముందు అనంత‌పురం అతిధి భ‌వ‌నంలో విడిది చేసిన‌పుడు కూడా క‌న్నాపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. అంత‌కుముందు శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం తిరుమ‌ల‌కు వ‌చ్చిన బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కాన్వాయ్ పై టిడిపి నేత‌లు దాడి చేశారు. 


అందుకేనా  బిజెపి డిమాండ్ ?


టిడిపి దాడుల‌ను తిప్పికొట్ట‌లేక‌, ఎదురుదాడి చేయ‌లేక బిజెపి నేత‌లు ఏపిలో  రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు అనుమానాలు మొద‌ల‌య్యాయి. బిజెపి నేత‌ల‌పై దాడుల‌నే కాదుకానీ మొత్తం మీద రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌నే చెప్పాలి. మ‌హిళ‌ల‌పై దాడులు, అత్యాచారాలు, హ‌త్య‌లు, దోపిడిలు, దొంగ‌త‌నాలు, సెక్స్ రాకెట్లకు పిల్ల‌ల‌ను అమ్మేయ‌టం లాంటివి బాగా పెరిగిపోయాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయి. సో, ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే బిజెపి ఏపిలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు డిమాండ్ చేస్తోంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: