సింబల్‌ టెన్షన్‌: అక్కడ గాజు గ్లాసుకు ఓటేస్తే కూటమి ఓటమే?

గాజు గ్లాసు.. ఇది జనసేన పార్టీ గుర్తు.. ఈ గుర్తుపై ఓటేస్తే సహజంగా జనసేన గెలవాలి. అంటే కూటమి అభ్యర్థి గెలవాలి. కానీ ఈ ఎన్నికల్లో చాలాచోట్ల జనం గాజు గ్లాసుకు ఓటేస్తే కూటమి ఓడిపోతుంది. అదేంటి.. అంటారా.. అదే తమాషా. జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు ఈసీ కేటాయించింది. అందువల్ల జనసేన పోటీలో లేని చోట.. అంటే కూటమి తరపున టీడీపీనో, బీజేపీనో పోటీలో ఉన్న చోట కూడా ఈవీఎంలో గాజు గ్లాసు కనిపిస్తుంది. అది అక్కడ ఓ ఇండిపెండెంట్‌తో అయి ఉంటుంది.

ఎవరైనా పొరపాటున పవన్‌ ఫ్యాన్స్, లేదా సాధారణ జనమో.. గాజు గ్లాసు పవన్‌ జనసేన గుర్తు కదా అని ఓటేస్తే.. అక్కడ కూటమి అభ్యర్థికి దెబ్బ పడినట్టే. మరి ఇలా ఎలా జరిగింది.. అంటే.. జనసేన ఇంకా గుర్తింపు పొందిన పార్టీ కాదు. అందుకే.. ఆ సింబల్‌ ను ఆ పార్టీ లేని చోట్ల ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టారు. ఇదే ఇప్పుడు కూటమి కొంప ముంచబోతోంది. జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది.

కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్న చాలా చోట్ల ఈ గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడంతో గందరగోళం నెలకొంది. 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. టీడీపీకి గెలిచా ఛాన్స్‌ కనిపిస్తున్న పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అంతే కాదు.. కూటమి రెబల్‌ అభ్యర్థులకు సైతం గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

 విజయనగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీలో ఉన్నారు. ఇక్కడ ఆమెకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. అలాగే  జగ్గంపేట నుంచి జనసేన రెబల్‌ అభ్యర్థి పి.సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు. ఈ రెండుచోట్ల టీడీపీకి దెబ్బ పడే అవకాశం కనిపిస్తోంది. కొసమెరుపు ఏంటంటే.. పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు తనయుడు కల్యాణచక్రవర్తి ఇండిపెండెంట్‌గా వేశారు. ఆయనకూ గాజు గ్లాసు గుర్తు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: