జగన్, పవన్ కలిసిపోనున్నారా..?

Vasishta

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వబోతున్నారా..? ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన సపోర్ట్ చేస్తారా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది వైసీపీ నేతల నుంచి..!! అయితే అది ఇప్పుడే చెప్పలేమంటున్నారు ఆ పార్టీ నేతలు కొందరు. అధికారపక్షం మాత్రం ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనంటూ తేలిగ్గా కొట్టేస్తోంది.


వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు వైసీపీకేనని తేల్చి చెప్పారు వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ తమకు మద్దతివ్వడం ఖాయమని ఆయన తేల్చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తాన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు పవన్ కల్యాణ్ తో స్నేహం ఉందన్నారు వరప్రసాద్. ఆయన మనసు తెలిసినవాడిగా తానీ మాట చెప్తున్నానన్నారు.


వచ్చే ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో వైసీపీ గెలుపు అవకాశాలను ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో ఎలాగైనా గెలవాలనుకుంటున్న వైసీపీ.. పవన్ కలిసొస్తే బాగుంటుందని ఆశిస్తోంది. పవన్ తమకు మద్దతిస్తే కాపు ఓటు బ్యాంకు మొత్తం తమవైపు వస్తుందని ఆలోచిస్తోంది. ఇందుకోసం తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం పొత్తులపై ఇప్పుడే వ్యాఖ్యానించేందుకు సిద్ధంగా లేనట్టు సమాచారం. పైగా తాను కమ్యూనిస్టులతో కలసి వెళ్లాలనుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు. అలాంటప్పుడు వైసీపీతో జట్టు కడతారా లేదా అనేది అనుమానమే.


అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం వరప్రసాద్ మాటలను తేలిగ్గా తీసుకుంది. వైసీపీ, జనసేన మధ్య రహస్య అవగాహన ఉందని, ఈ రెండు పార్టీలను కేంద్రంలోని బీజేపీ ఆడిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ పార్టీలకు వేసే ఓట్లన్నీ బీజేపీకి వేసినట్లేనని సెలవిచ్చింది. తాము మొదటి నుంచీ ఈ మాట చెప్తున్నామని, తెలుగుదేశం పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టేందుకు రాష్ట్రంలోని అన్ని శక్తులను ఏకం చేసి పురిగొల్పుతోందని బీజేపీపై మండిపడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: