ఎడిటోరియ‌ల్ః సింగ‌పూర్ కు రాసిచ్చేశారు

Vijaya
అత్తసొమ్ము అల్లుడు దానం చేసిన‌ట్లు అనే సామెత చంద్ర‌బాబునాయుడుకు స‌రిగ్గా స‌రిపోతుంది. త‌ర‌త‌రాలుగా వార‌స‌త్వంగా వ‌చ్చిన  క‌కోట్లాదిరూపాయ‌ల విలువైన రైతుల‌ పంట భూముల‌ను అప్ప‌నంగా సింగ‌పూర్ కంపెనీల‌కు చంద్ర‌బాబు రాసిచ్చేశారు.  రాజ‌ధాని క‌ట్టేదీ లేదు చూసేదీ లేదని జ‌నాలు అనుకుంటున్న స‌మ‌యంలో స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు అనే పేరుతో సింగ‌పూర్ లోని కంపెనీల‌కు విలువైన 1691 ఎక‌రాలపై స‌ర్వ‌హ‌క్కులు రాసిచ్చేస్తూ ఒప్పందాలు చేసుకున్నారు. గురువారం సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ తో సిఆర్డీఏ ఉన్న‌తాధికారుల‌కు మ‌ధ్య ఒప్పందాలు జ‌రిగాయి. త‌మను చంద్ర‌బాబు మోసం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో రాజ‌ధాని ప్రాంతంలోని రైతులు అమ‌రావ‌తిలో ఎంత ఆందోళ‌న చేసినా ఉప‌యోగం లేక‌పోయింది. విచ‌త్ర‌మేమిటంటే స్టార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు కాల‌ప‌రిమితి 15 ఏళ్ళ‌యితే రాయితీలు మాత్రం 20 ఏళ్ళుంటాయ‌ట‌. 


స్టార్ట‌ప్ ఏరియా క్రింద సింగ‌పూర్ కంపెనీల‌కు ఇవ్వాల్సిన 1691 ఎక‌రాల‌ను ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా 12 నెల‌ల్లోగా అమ‌రావ‌తి డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు (ఏడిపి)కి అప్ప‌గించాలి. ఏడిపిలో సింగ‌పూర్ కంపెనీలు అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ కంపెనీల‌దే పై చేయి. ఎలాగంటే, ఏడిపికి ఛైర్మ‌న్ తో పాటు ఆరుగురు స‌భ్యుల్లో న‌లుగురు కంపెనీల వ్య‌క్తులే. దాంతోనే అర్ధ‌మైపోతోంది సింగ‌పూర్ కంపెనీల‌కు చంద్ర‌బాబు  ఎంత‌టి అధికారాలు క‌ట్ట‌బెట్టారో. అప్ప‌చెప్పిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా విభ‌జించి అమ్ముకునే స‌ర్వ హ‌క్కులూ సింగ‌పూర్ కంపెనీల‌కే క‌ట్ట‌బెట్టారు. పైన చెప్పుకున్న 1691 ఎక‌రాల్లో ఉన్న దేవాల‌యాలు,  మ‌సీదులు, చ‌ర్చిలు, శ్మ‌శానాల‌తో పాటు ఇత‌ర‌త్రా నిర్మాణాల‌ను తొల‌గించే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. 


మెజారిటీ వాటా సింగ‌పూర్ కంపెనీల‌దే


అదే స‌మ‌యంలో రాజ‌ధాని కోర్ క్యాపిట‌ల్ ను అభివృద్ధి చేసే పేరుతో సింగ‌పూర్ కంపెనీలు అసెండాస్-సింగ్ కార్ప్ కంపెనీల‌తో సింగపూర్-అమ‌రావ‌తి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ అనే సంస్ధ ఏర్పాటైంది. ఇందులో 58 శాతం వాటా సింగ‌పూర్ కంపెనీల‌కుంటే మిగిలిన 42 శాతం వాట అమ‌రావ‌తి డెవ‌ల‌ప్మెంట్ పార్ట‌ర్న‌ర్స్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకుంటుంది. అంటే ఇక్క‌డ కూడా మెజారిటీ వాటా సింగ‌పూర్ కంపెనీల‌దే అని అర్ధ‌మైపోతోంది. 


నిబంధ‌న‌ల‌న్నీ సింగ‌పూర్ కంపెనీల‌కే అనుకూలం


సింగ‌పూర్ కంపెనీల‌కు రాసిచ్చిన 1691 ఎక‌రాల‌ను అభివృద్ధి చేయ‌టానికి 15 ఏళ్ళ వ్య‌వ‌ధితో ఒప్పందాలు చేసుకున్నారు. మొద‌టి ద‌శ‌లో 656 ఎక‌రాల‌ను అభివృద్ధి చేసి రెండో ద‌శ‌లో చేయాల్సిన అభివృద్ధికి 656 ఎక‌రాల‌ను అమ్ముకోవ‌చ్చు. అంటే భూములు రైతుల‌ది. అభివృద్ధి చేసేది ప్ర‌భుత్వం. అమ్ముకునే హ‌క్కులు మాత్రం సింగ‌పూర్ కంపెనీల‌వ‌న్న మాట‌. అభివృద్ధి చేసిన భూమిలో 70 శాతం అమ్ముడుపోయిన త‌ర్వాతే రెండో ద‌శ ప‌నులు ప్రారంభించేట్లుగా ఒప్పందాలు చేసుకున్నారు. అంటే అనుకున్న‌ట్లుగా 70 శాతం భూములు అమ్ముడుపోక‌పోతే రెండో ద‌శ ప‌నులు ప్రారంభం కావ‌న్న‌మాట‌. 


వివాదాల మాటేంటి ?


రెండో ద‌శ పనుల‌ను మొద‌లుపెట్ట‌క‌పోయినా కంపెనీల‌ను అడిగేందుకు లేదు. ఎందుకంటే, ఎటువంటి వివాదాలైనా ప‌రిష్క‌రించుకోవాలంటే లండ‌న్ కోర్టులో మాత్ర‌మే కేసు వేయాల్సుంటుంది. లండ‌న్ కోర్టులో ఎవ‌రు కేసు వేస్తారు ? అక్క‌డి కోర్టులో కేసు వాదించే స్దాయి ఎంత‌మందికి ఉంటుంది ? ఎవ‌రికైనా ఉన్నా ఆ ఖ‌ర్చుల‌ను ఎవ‌రు పెట్టుకుంటారు ? ఒక‌వేళ అక్క‌డి కోర్టులో కేసు వేసినా ప్ర‌తీ వాయిదాకు లండ‌న్ వెళ్లాలంటే మాట‌లా ? అంటే తాము చేసుకున్న ఒప్పందాల్లో లొసుగులున్న మాట చంద్ర‌బాబుకు బాగా తెలుసు. అందుక‌నే ఎవ‌రికీ దొర‌క‌కుండానే లండ‌న్ కోర్టును తెర‌పైకి తెచ్చారు. 


లండన్ కోర్టుకు ఎవ‌రు వెళ్ళాలి ?


ఒక‌వేళ ప్ర‌భుత్వం మారితే ఒప్పందాల‌ను స‌మీక్షించాల‌న్నా సాధ్యం కాదు. ఎందుద‌కంటే, వ‌చ్చే ప్ర‌భుత్వం ఒప్పందాల‌ను స‌మీక్షించాల‌ని అనుకుంటే సింగ‌పూర్ కంపెనీలు వెంట‌నే లండ‌న్ కోర్టును ఆశ్ర‌యిస్తాయి. అప్పుడు ప్ర‌భుత్వ‌మే లండ‌న్ కోర్టులో కేసు వేసి వాదించుకోవాల్సుంటుంది. హై కోర్టు, సుప్రింకోర్టులో ఉన్న వేలాది కేసుల‌కే దిక్కు లేన‌పుడు లండ‌న్ కోర్టులో కేసు ఎప్పుడు తేలాలి ?  మొత్తం మీద దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో అవినీతి జ‌రిగింద‌ని వేసిన కేసులు అనుభ‌వంతో చంద్ర‌బాబు ముందుజాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు ప‌లువురు అనుమానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: