అశోక్ బాబుకు దక్కబోయే ‘పదవి’పై ఉత్కంఠ...!!

Vasishta

రాజకీయాల్లోకి రావాలంటూ ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు చూపించిన పోరాటపటిమను గుర్తించి తెలంగాణ సీఎం కేసీఆర్.. వాళ్లకు పలు పదవులు కట్టెబెట్టారు. ఇప్పుడు అదే బాటలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా నడవబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.


జూన్ 2న విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఎన్జీవో నేత అశోక్ బాబుపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అశోక్‌బాబు విషయంలో చంద్రబాబుకు మంచి ఒపీనియన్ ఉండటం కొత్తేమీ కాదు. అయితే ఉద్యోగిగా కాకుండా ప్రజాప్రతినిధిగా చూడాలని చంద్రబాబు స్వయంగా ఆకాంక్షించడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం కావాలని, రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించడంతో ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా ఆనందాశ్చర్యాలతో మునిగిపోయాయి.


సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి పోరాడారు. నాడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలన్నీ పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంది. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన నేతగా అశోక బాబు సుపరిచితుడయ్యారు. అయితే ఆ తర్వాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా అశోక్ బాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే వాటినేవీ అశోక్ బాబు పట్టించుకోలేదు.  అయితే ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో మాత్రం ఆయన పోరాడి సాధించారనే పేరు తెచ్చుకున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో ఆయనకు మంచి పేరుంది.


విభజనతో నష్టపోయిన నవ్యాంధ్ర అభివృద్ధికి ఉద్యోగులందరూ దోహదపడాల్సిన అవసరం ఉందనేది అశోక్ బాబు మాట. అందుకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన బహిరంగంగానే చెప్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో తప్పులేదని ఆయన స్పష్టంచేశారు. ఎవరేమనుకున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎప్పుడూ రాజీ పడబోమని ఆయన తేల్చిచెప్పారు.


అశోక్ బాబు రాజకీయాల్లోకి రావడం ఖాయమని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఆయనకు పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆయన పేరు కూడా ఎమ్మెల్సీ జాబితాలో ఉందని చివరి నిమిషం వరకూ ప్రచారం జరిగింది. అయితే లాస్ట్ మినిట్ లో అశోక్ బాబుకు ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు ఆయన్ను స్వయంగా సీఎం ప్రజాసేవలోకి ఆహ్వానించడంతో తప్పకుండా త్వరలోనే పదవి దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది. అశోక్ బాబు ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయనకు మంచి పదవి దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయనకు ఎమ్మెల్సీ దక్కుతుందా.. లేకుంటే ఎమ్మెల్యేగా బరిలోగి దిగుతారా అనే విషయాలు మున్ముందు తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: