ఏపిలో అకాలవర్షం బీభత్సం..17 మంది మృతి!

siri Madhukar
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎండలు మండి పోయాయి...ప్రస్తుతం తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో దీనికి విరుద్దంగా వడగళ్ల వానలతో ప్రకృతి బీభత్సం సృష్టించింది.  ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్ని ప్రాంతాలూ అకాలవర్షాలతో అల్లాడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్నంతా గడగడలాడించిన వర్షాలు నేడు నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలను వదల్లేదు.

ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో గాలి, వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు, ఉదయగిరి మండలాలలో పిడుగులు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచింది. పలు చోట్ల పిడుగులు పడి 16 మంది మృతి చెందగా, చెట్టు కూలి ఒకరు మరణించారు. సముద్రంలో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతు కావడంతో వారి కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. ఉద్ధృతంగా వీస్తున్న గాలుల ధాటికి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పలు ప్రాంతాల్లో మామిడి, అరటి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు, సముద్రం ఒడ్డున ఉన్న ఉప్పు సాగు కూడా నాశనం అయ్యాయి. నూర్పిడికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి పోయింది. చాలా చోట్ల హోర్డింగులు నేలకూలాయి. దాదాపు 1.20 లక్షల బస్తాల ధాన్యం, 50వేల బస్తాలకు పైగా మొక్కజొన్న వర్షపు నీటిలో తడిసిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచినే వాతావరణం మారిపోయింది. అంత వరకూ సూర్యుడు నిప్పులు కురిపించే ఎండతో చెలరేగిపోగా, అంతలోనే కారుమబ్బులు కమ్మేశాయి. మరో వైపు ఈదురుగాలులు చెలరేగిపోయాయి. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈదురుగాలులకు తాటి చెట్టొకటి విరిగిపడి ఒక వ్యక్తి మరణించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే పిడుగుపాట్లతో ఏడుగురు మరణించినట్టుగా తెలుస్తోంది. 

 ఈ జిల్లాలో పంటనష్టం కూడా తీవ్రంగా ఉంది. ధాన్యం ఆరబెట్టుకున్న రైతుల పరిస్థితి కూడా ధైన్యంగా మారింది.సుమారు 1000 ఎకరాల్లో బొప్పాయి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. ప్రజలు సురక్షిత చర్యలు తీసుకోవాలని, నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: