జగన్ ‘కమ్మ’ని పాచిక..! కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు.!!

Vasishta

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సాగుతోంది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర ఇవాళ నిమ్మకూరు చేరుకుంది. నిమ్మకూరులో నందమూరి కుటుంబీకులు కొందరు జగన్ ను కలిసారు. పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్.. గ్రామస్థుల సమక్షంలో సంచలన ప్రకటన చేశారు.


          కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇవాళ ఆయన పాదయాత్ర నిమ్మకూరు చేరుకుంది. నిమ్మకూరులో నీరు-చెట్టు పథకం కింద జరుగుతున్న అక్రమాలను నందమూరి కుటుంబీకులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పూడికతీత పేరుతో చెరువు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చెరువులో పొక్లెయిన్లతో తవ్విన దృశ్యాలను జగన్ కు చూపించారు. నిమ్మకూరును ఎన్టీఆర్ మనవడు, ఐటీ మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్నారని చెప్పారు. 3-4 అడుగులు మట్టి తీయాల్సి ఉండగా 50 అడుగుల వరకూ తవ్వి ఆ మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ ఈ సందర్భంగా గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. నిమ్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు.


          కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ్తామంటూ జగన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని ఆర్థం చేసుకోవచ్చు. కోస్తాలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గానిదే ఆధిపత్యం. ఈ వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. టీడీపీ ఓటుబ్యాంకును దెబ్బకొట్టి తమవైపు కాస్తోకూస్తో కమ్మ సామాజికవర్గ ఓటర్లను తిప్పుకోగలిగితే వైసీపీ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఎన్టీఆర్ ను కమ్మ సామాజికవర్గం తమ ఆరాధ్యదైవంగా భావిస్తుంది. అందుకే ఎన్టీఆర్ ను వాడుకోవడం ద్వారా ఆ వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు జగన్ వ్యూహరచన చేశారని భావించవచ్చు.


          కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఈనాటిది కాదు. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్ వినిపిస్తోంది. అయితే వివిధ కారణాల రీత్యా అది ఇంతవరకూ నెరవేరలేదు. అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పుకుంటూ వస్తున్న పార్టీలు ఇప్పటివరకూ ఆ డిమాండ్ నెరవేర్చలేదు. అధికారంలోని తెలుగుదేశం కూడా ఎన్టీఆర్ పేరు పెడ్తామని గతంలో చెప్పింది. అధికారంలో ఉన్నా కూడా ఆ పనిచేయలేదు. మరిప్పుడు జగన్ ప్రకటనతో అయినా టీడీపీ మేల్కొంటుందా.. లేకుంటే జగన్ కు ఆ ఛాన్స్ ఇస్తుందా.. అనేది వేచి చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: