బీజేపీకి షాక్..! వైసీపీలోకి కన్నా జంప్..!?

Vasishta

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బీజేపీని వదిలి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కన్నాకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి బిగ్ షాక్ తగలబోతోంది.! అధ్యక్ష పదవి పరిశీలనలో ఉన్న కన్నా లక్ష్మినారాయణ బీజేపీని వదిలేసి.. వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుచరులతో కన్నా లక్ష్మినారాయణ భేటీ కావడం ఇందుకు ఆస్కారం కలిగిస్తోంది. కన్నా లక్ష్మినారాయణకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఓ వర్గం కోరుతుండగా.. మెజారిటీ బీజేపీ నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు అధ్యక్షపదవి ఎలా ఇస్తారని మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారు.


ఓ వర్గం వ్యతిరేకించడం, మరో వర్గం సమర్థించడం లాంటివి ఎక్కడైనా ఉండేవే.! అయితే వాటిని కన్నా పట్టించుకోవడం లేదని సమాచారం. తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను బీజేపీలో ఉండేందుకు సిద్ధంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదేళ్లపాటు అధికారంలో లేకపోవడం, జిల్లాలో తన కేడర్ నిరుత్సాహంలో ఉండడం కన్నాను వేధిస్తోంది. చంద్రబాబు బీజేపీని దోషిని చేసి బయటకు రావడంతో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ మనుగడ కష్టమనే నిర్ణయానికి కన్నా వచ్చేశారని ఆయన అనుచరులు చెప్తున్న మాట. ఇప్పుడు బీజేపీలో కొనసాగి ఎన్నికల బరిలో నిలిస్తే మరోసారి ఓడిపోవడం ఖాయమని, అప్పుడు మరో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కన్నా భావిస్తున్నారట. అందుకే సేఫ్ జోన్ చూసుకుంటున్నారట.


వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించి కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ విభజనానంతరం ఆ పార్టీని వదిలేసి బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి లభిస్తుందంటూ ప్రచారం మొదలైంది. అయితే అధ్యక్ష పదవి దక్కినా పార్టీ బతికే పరిస్థితి లేనప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదనే భావన కన్నాలోనూ, ఆయన అనుచరుల్లోనూ ఉంది. అనుచరులు కూడా బీజేపీ నుంచి బయటికొచ్చి వైసీపీలో చేరితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆయన ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: