ఫేక్.. ఫేక్.. ఫేక్..! చంద్రబాబు ఫుల్ సీరియస్..!!

Vasishta

ప్రత్యేక హోదా సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలి.. అనే అంశాలపై పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది.


ప్రత్యేకహోదా సాధనతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నెల 21 నుంచి సైకిల్ యాత్రలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. సుమారు 20 రోజులపాటు ఈ సైకిల్ యాత్రలు సాగనున్నాయి. ప్రభుత్వ విజయాలను పండుగలాగా చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. రోజుకో అంశాన్ని తీసుకుని ప్రచారం చేపట్టాలని సూచించారు. యాత్ర ముగింపు సమయంలో నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగసభలు నిర్వహించనున్నారు.


గత నాలుగేళ్లలో ఏం చేశాం.. విభజన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి లాంటి అంశాలను పక్కాగా ప్రజల ముందు ఉంచాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో అభివృద్ధి అద్భుతంగా సాగుతోందని తమిళనాడులో ప్రచారం జరుగుతోందని, ఇలాంటి వాటిని ప్రజలకు వివరించాలన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్టు చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు సైకిల్ యాత్రలను ఇందుకోసం వినియోగించుకోవాలన్నారు. సైకిల్ యాత్రల ద్వారా జనంలో చైతన్యం రావాలన్నారు.


20వ తేదీన ప్రత్యేక హోదాకోసం తాను విజయవాడలో దీక్ష చేయబోతున్నట్టు చంద్రబాబు చెప్పారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు జరగాలని, ఇందులో ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు పాల్గొనాలని కోరారు. 13 జిల్లాల్లో 13 మంది మంత్రులు కూడా పాల్గొనాలని స్పష్టం చేశారు. మిగిలిన మంత్రులు రాజధానిలో తన దీక్షలో పాల్గొంటారని వివరించారు. వై.ఎస్.ఆర్. పార్టీని ఫేక్ పార్టీ అన్న చంద్రబాబు.. వాళ్ల ప్రచారమంతా ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో సాగుతోందన్నారు. వాళ్ల రాజకీయమే ఫేక్ అన్నారు.. ఇలాంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అసత్యప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: