చిరంజీవికి బంపరాఫర్ ఇచ్చిన రాహుల్ గాంధీ..!

Vasishta

మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సినిమాల్లో మెగాస్టార్ గా ఉన్నప్పుడే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం.., తదనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం.., ఆయన మంత్రికావడం.., ఇటీవలే ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడం.. చకచకా జరిగిపోయాయి. ఇప్పుడాయన కాంగ్రెస్ నేత మాత్రమే. అయితే ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. చిరంజీవికి బంపరాఫర్ ఇచ్చారట. దాన్ని చిరంజీవి తిరస్కరించినట్టు సమాచారం.


          చిరంజీవి లాంటి పాపులర్ వ్యక్తిని ఏ పార్టీ కూడా వదులుకోవాలనుకోదు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. దీంతో ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు మంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో ఓడిన తర్వాత మంత్రి పదవి పోయినా.. గత నెల వరకూ ఆయన ఎంపీగా కొనసాగారు. ఎంపీ పదవీకాలం పూర్తయిపోవడం, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి.. చిరంజీవికి పిలుపొచ్చింది.


          చిరంజీవి.. రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఆయన పార్టీలో ఉన్నత పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు నేరుగా చెప్పారు. అయితే చిరంజీవి మాత్రం రాహుల్ ఆఫర్ ను తిరస్కరించారు. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని, పార్టీకి పూర్తికాలం పనిచేసే సిచ్యుయేషన్ లో లేనని స్పష్టంచేశారట. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని తేల్చి చెప్పిన చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారట. దీంతో రాహుల్ కూడా బలవంతం చేయకుండా సరేనన్నారట.


          చిరంజీవి ప్రస్తుతం 2 సినిమాల్లో బిజీగా ఉన్నారు. సైరాతో పాటు మరో సినిమాకు ఆయన కమిట్ అయ్యారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా కూడా.. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో చిరంజీవి అస్సలు కనిపించడం లేదు. క్రియాశీలంగా లేకపోయినా చిరంజీవి కాంగ్రెస్ నేతేనని చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి చూద్దాం.. చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: