చంద్రబాబూ! నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! వ్యధ చెందకు బ్రదర్ ఇంకెన్ని చూడాలో?

"అందరికి శకునం చెప్పే బల్లే కుడితి లో పడ్డట్టుంది" ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ప్రతిరోజూ వైసిపి అధినేత జగన్మొహనరెడ్డిని శాసన సభ లోపల వెలుపల ఒక నేఱస్థుడుగా, ద్రోహిగా చూడటం అలవాటైపోయింది రాష్ట్రాధినేతకు. చివరికి రాజకీయనాయకుల మద్య ఇంత పగ, కక్ష , ప్రతీకారం తీర్చుకొనే ధోరణి అవసరమా అనిపిస్తుంది.

అంతేకాదు టిడిపి అనుకూల మీడియా ఐతే జగన్ పై అంతకు మించిన ఆగ్రహాన్ని ప్రదర్శించటం పత్రిక, చానల్స్ సముఖంగా గమనిస్తూనే ఉన్నాం. అది పద్దతి కాదు అని చెప్పే ఇతర ప్రతిపక్షాలు కూడా లేకుండా పోయాయి శాసనసభలో. ఎందుకంటే టిడిపికి బిజెపి నాడు మిత్రపక్షం అవటంతో బాహాటంగా బిజెపి,  టిడిపి విధానాన్ని  ఖండించటం జరిగేది కాదు. చివరకు రాజకీయాలకతీతంగా ప్రవర్తించవలసిన శాసనసభ సభాపతి కూడా మరో టిడిపి శాసనసభ్యుడు గానే ప్రవర్తించటంతో శాసనసభను సభ్యతగా నడిపే 'మధ్యవర్తి తరహా న్యాయమూర్తి' లాంటి వ్యక్తులు లేకపోవటం జరిగిపోయింది.

నాటి నలభై సంవత్సరాల అనుభవమనే మిడిసిపాటుకు నేడు వగచనేల?


దీనికి తోడు శాసనసభ్యులను కొనేసే అధికారపక్ష రాకీయం తారస్థాయికి చేరింది.  అందుకే తమకు సరైన స్థానం లేని శాసనసభలో వైసిపి నిలువలేక పోవటం, జరిగి, జనం లోకి వెళ్ళిపోయారు జగన్.  అందుకే  ఇంత వరకు అంతా టిడిపి నాయకత్వం కోరుకున్నట్లు శాసనసభలో.జరిగిపోయింది.  అయితే ఇప్పుడు టేబుల్స్-టర్న్ అయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో తెదెపా-బాజపా స్నేహ బంధం తెగిపోయింది.  కారణం వైసిపి ప్రత్యేక హోదా ఆకాంక్ష ను ప్రామాణికంగా ప్రజల్లో ఉవ్వెత్తున రగల్చటం టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేసింది.


దీంతో పరిస్థితులన్నీ తలక్రిందులై ఇప్పుడు వైసిపి గతంలో అనుభవించిన అవమానాలు దశ దిశ మార్చుకొని టిడిపి వైపు చూపుడువేలుతో చూపిస్తున్నాయి. శాసనసభలో బాజపాను వాగ్ధానాలు నెఱవేర్చలేదని టిడిపి అధినేత ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఇప్పటివరకు శాసనసభలో చంద్రబాబు చెప్పిందే వేదం అన్న తరహాగా మారిపోయింది. బాజపా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.

బాజపా మీ దర్శకత్వంలోనే ప్రత్యేకపాకేజీ ఇచ్చినప్పుడు, మీరు దానిని అంగీక రించారు, దానిని రాబట్టవలసిన బాధ్యత మీదే కదా? ఇప్పుడు ప్రజలకు చెప్పు కొని విలపిస్తే సానుభూతి  దొరకక పోగా అవమానం అనుమానం రెండూ పెనుభూతాలౌతాయి. నువ్వూ మూసుకో నేనూ మూసుకుంటా అనే పద్దతి ఇక్కడ సరిపోతుంది.


తమ చేతలను ఎవరు తప్పుపడితే వారిని, ఎవరు నిందలు వేస్తే వారిని ప్రగతి నిరోధకులుగా ముద్రవేయడం. వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగడం. వారి మీదే ప్రజల్లో అపనమ్మకం కలిగేలా, వారి అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టడం అనేది చంద్రబాబు అనుసరించే అత్యాధునిక రాజనీతి. ఇన్నాళ్లూ ప్రభుత్వ వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న అనేక అరాచక పోకడల గురించి, వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన జగన్మోహనరెడ్డి ఏం ప్రశ్నించినా, ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి కార్యకలాపాల గురించి వైకాపా ఢిల్లీలో ఏ చిన్న ఫిర్యాదు చేసినాసరే, తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో పైన చెప్పిన అత్యాధునిక రాజనీతితో విరుచుకుపడిపోతూ ఉండేవారు.
మీరు సమాజసేవ చేసిన రోజుల్లో మీరు అనుసరించింది ఈ దేశానికి "ఏమర్జెన్సీ ప్రధాత సంజయ్ గాంది" ని. చరిత్ర చెప్పుకోకండి అదంత బాగాలేదు. జనం చీకటిరోజులు గుర్తుకు తెచ్చుకుంటారు (ఆ తరం వాళ్ళం మేం ఇంకా బ్రతికున్నాం!)


"అత్యాధునిక రాజనీతిలో బిజెపి కూడా తాడిని తన్నే వాడి తల తన్నే తత్వమే"  ఇంకేం ఏపి శాసనసభలో ప్రతిపక్ష ధిక్కార స్వరం ద్వనించింది. శాసనసభ వెలుపల వైసిపికి తోడు సోము వీర్రాజు ఉండనే ఉన్నారు. టిడిపికి ఇందులో బాజపా సమౌజ్జీనే.  "పట్టిసీమపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతారా? నిన్నటివరకు మా ప్రభుత్వంపై కన్పించని అవినీతి ఇప్పుడెలా కన్పించింది? పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కుట్రలు పన్ను తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టుల ను నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనేందుకే ఇవన్నీ చేస్తున్నారు. రాష్ట్రం పై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చే.స్తున్నారు. పోలవరంతో పాటు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడ "కాగ్ రిపోర్టు" లో అనేక తప్పులను ఎత్తి చూపుతోంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మోడీ ప్రభుత్వంపై కూడ కేసులు వేస్తారా? ఇంతకాలం పాటు మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయని బీజేపీ నేతలు ఇప్పడే ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? పోలవరం కాంట్రాక్టర్ ను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంపిక చేసింది"  అని చంద్ర బాబు చెప్పారు.


ఇదే ప్రశ్న తెదెపాకు బాజపే వేస్తే? నిన్నటి  వరకు తమ మిత్ర పక్షం అద్భుతంగా సహకరిస్తుందని తమరాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడిపించేందుకు ఎంతగానో సహాయ పడుతుందని అనేక సందర్భాల్లో టిడిపి అధినేత పార్టీ సభ్యులు చెపుతూ వచ్చారు. మరి ఇప్పుడెందుకు బాజపాపై కత్తులు నూరుతున్నరనే ప్రశ్న. 

శాసనసభ లో ప్రతిపక్షం లేని ప్రశాంతత అనుభవించారు ఇప్పటివరకు-ఇప్పుడు మొదలౌతుంది సంగీత విభావరి


"కూరిమిగల దినములలో నెరములెన్నడును గలుగ నేరవు-మరి యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి...." అని సుమతి శతక కారుడు చెప్పిన సూక్తిని యదార్ధం చేస్తున్నారు ఈ తెదెపా-బాజపా విడిపోయిన స్నేహితులు సారి శత్రువులు. గతంలో వైసిపి తమ మిత్రపక్షానికి వైరిపక్షం.  కాని ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్,  ఇటు టిడిపికి అటు బిజెపికి విజయ ప్రధాత. ఇప్పుడు ఆయన పిర్యాదు చేయటంతో బాజపాకు వైసిపి చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. 


తాను ఇంతవరకు వైసిపి జగన్మోహనరెడ్డిని, ఒక నేఱగాడుగా చూపిస్తూవచ్చిన వేలిప్పుడు తనవైపే చూపే పరిస్థితులు నెలకొన్నాయి చంద్రబాబుకు. అందుకే "సందు చూసి ఫిరంగి పేల్చే బాజపా" ఇంకా ఊరుకుంటుందా? పట్టిసీమలోనే కాదు పొలవరంలోను అవినీతి ఆకాశాన్నంటిందని ఉండవల్లితో సహా అనేక మంది తటస్థులు కూడా ఆరోపించారు. ఇందులో అనేక ప్రముఖ అధికారుల ప్రమేయం ఉందని అంటున్నారు. వారిని విచారణ చేస్తే కలుగులోని చిట్టేలుకలతో పాటు పందికొక్కులూ బయట పడవచ్చు. అందుకే బాబుకు గుండె దడ మొదలై శాసనసభలో  చెప్పుకొని సానుభూతికోసం  తాపత్రయ పడుతున్నారు.


ప్రస్తుతానికి సానుభూతి ప్రత్యేక హోదా తెచ్చిన వారికి, దాన్ని ఇచ్చిన వారికి, మాత్రమే లభిస్తుంది. ఈ మద్య విజయసాయి రెడ్డి తరచుగా ప్రధానిని కలవటం చంద్రబాబు పదే పదే చెప్పుకొని వ్యధ చెందటం ఆయన లోని నిరాశా నిస్పృహల వెల్లువ ను తెలుపుతుంది. ఇదీ కథ. 
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: