సెన్సేషన్ : రాజకీయాల్లోకి జేడీ లక్ష్మినారాయణ..! ఉద్యోగానికి రాజీనామా..!!

Vasishta

జేడీ లక్ష్మినారాయణ.. ఈ పేరు తెలియని తెలుగువారుండరేమో..! ఆయన విచారించిన కేసులు, సాధించిన విజయాలు సంచలనం.! ఇక విద్యార్థులకు ఆయన బోధించిన పాఠాలు నిత్యస్మరణీయం..!! వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి అపారం. అయితే ఆయన ఇప్పడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.


          తెలుగువాడైన లక్ష్మినారాయణ మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి. డిప్యుటేషన్ పై సీబీఐకి వెళ్లిన లక్ష్మినారాయణ సొంతరాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2006లో బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి ఆయన చేపట్టిన కేసులు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కేసు, యడ్యూరప్ప అక్రమాస్తుల కేసు... ఇలా ఒకటేమిటి ఆయన చేపట్టినవన్నీ సెన్సేషనే.!


లక్ష్మినారాయణ పేరు బయటికి తొలిసారి వచ్చింది ఫోక్స్ వ్యాగన్ కేసు ద్వారా.! అనంతరం వై.ఎస్. హయాంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ, సత్యం కంప్యూటర్స్ స్కామ్.. అనంతరం చేపట్టారు. వీటిని సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించారు. ఈ కేసుల్లో ఎంతో మంది రాజకీయ నాయకులతో పాటు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా జైలుపాలవ్వాల్సి వచ్చింది. ఏడేళ్లపాటు డిప్యుటేషన్ పై సీబీఐలో పని చేసిన లక్ష్మినారాయణ.. తదనంతరం మహారాష్ట్రలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా ఉన్నారు.


కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించిన లక్ష్మినారాయణ మహారాష్ట్ర కేడర్ కు చెందినవారైనా.. తెలుగువారితో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఎన్నో కాలేజీలకు హాజరై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు తీసుకున్నారు. అలా.. ఎంతోమంది విద్యార్థులకు చేరువయ్యారు. ఆయనంటే తెలుగువారికి అపారమైన అభిమానముంది. ఆయన ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావడానికే ఆయన రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరుతారు.. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన ఇమడ గలరా..? లేక సామాజిక కార్యక్రమాలకే పరిమితమవుతారా.. అనేది మున్ముందు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: