రాజ్య‌స‌భ ఎన్నిక‌లు... తెలంగాణ‌లో స‌స్పెన్స్‌... ఉత్కంఠ‌

VUYYURU SUBHASH
ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు.. ఇక ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఓటేసే అవకాశం ఉంటుందో లేదోననే ఉత్కంఠ కొనసాగుతోంది. తమ శాసనసభ సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు స్వల్ప ఊరట లభించింది. మరో ఆరునెలలపాటు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ స్టే ఇచ్చింది. 


ఇక ఆ ఇద్దరికీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీసుకున్న కఠిన నిర్ణయం అనేక పరిణామాలకు దారితీసింది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల కమిషన్ కు నివేదించడం చకచకా జరిగిపోయాయి. 


అయితే ఈ నెల 23న నిర్వహించనున్న రాజ్యసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు ఓటేసే అర్హత ఉంటుందా..? లేదా..? అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేలంటూ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే అన్నారు. మరోవైపు తమ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్ కు లేదని, దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన బలం లేకున్నా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తో కాంగ్రెస్ నామినేషన్ దాఖలు చేయించింది. 


ఏదైనా మ్యాజిక్ జరగకపోతుందా.. అని ఆశగా ఉన్న కాంగ్రెస్ కు ఇద్దరు సభ్యత్వాల రద్దుతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం పదమూడు మంది ఎమ్మెల్యేలు. ఇందులో ఇద్దరి సభ్యత్వాలు రద్దు కావడంతో బలం పదకొండుకు పడిపోయింది. అయితే ఈ ఇద్దరికీ ఒటేసే అర్హత ఉంటుందా.. లేదా.. అన్నది తేలాల్సి ఉంది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 22న మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. 


అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 22న హైకోర్టు ఏమైనా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: