సంచలనం : ‘ప్రత్యేక హోదా’పై పవన్ ‘యూటర్న్’..? మోదీపై పొగడ్తలు..!

Vasishta

ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తోంది. నిన్నటిదాకా ప్రత్యేక హోదా మాటెత్తితే జైల్లో పెడతామంటూ బెదిరించిన టీడీపీ సర్కార్ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా గళమెత్తింది. రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ హోదా కోసం ఉద్యమిస్తున్నాయి. ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ మొదటి నుంచి గళమెత్తిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చారు. ఇదే ఇప్పుడు అతి పెద్ద సంచలనం.!


          రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి గత ఎన్నికల్లో మద్దతిచ్చాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. తమ వల్లే రాష్ట్రంలో టీడీపీ గెలిచిందని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. వైసీపీ కూడా ఇదే మాట చెప్తూ ఉంటుంది. పవన్ లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదని.! సరే.. ఇవన్నీ గతం. కొంతకాలంగా ప్రత్యేక హోదా మాట వినిపిస్తున్న వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరు. హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ బీజేపీని పవన్ గట్టిగా హెచ్చరించారు. అనంతపురం, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం బహిరంగసభల్లో బీజేపీని టార్గెట్ గా చేసుకునే మాట్లాడారు. అప్పటివరకూ పవన్ కు టీడీపీ మిత్రపక్షమే.


          మొన్న పార్టీ ఆవిర్భావ సభలో మాత్రం పవన్ అధికారపార్టీపై విరుచుకుపడ్డారు. హోదా వద్దని ప్యాకేజీ కావాలన్న టీడీపీ.. ఇప్పుడు మళ్లీ హోదా కోసం ఉద్యమిస్తోందన్నారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి, అవినీతి వల్లే బీజేపీ కేర్ చేయట్లేదని ఘాటుగా విమర్శించాడు పవన్. హోదా కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమన్నారు. అమరావతిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, కేంద్రం ఎలా దిగిరాదో చూస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హోదా ఉద్యమం మరింత వేడెక్కింది.


          అయితే ఆవిర్భావ సభ తర్వాత పలు ఛానళ్లు పవన్ ను ఇంటర్వ్యూ చేశాయి. హోదా ఉద్యమం పవన్ వల్లే మళ్లీ పట్టాలెక్కిందని అందరూ భావిస్తున్న తరుణంలో పవన్ ఒక్కసారిగా స్టాండ్ మార్చుకున్నారు. సీఎన్ఎన్ న్యూస్ 18కు ఇచ్చిన ఛానల్లో ప్రత్యేక హోదా అయినా, ప్యాకేజీ అయినా రాష్ట్రానికి మేలు జరగడమే ముఖ్యమన్నారు. హోదా హామీ మోదీ ఇవ్వలేదని, నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. మోదీతో తనకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయని పవన్ స్పష్టం చేశారు. దీంతో పవన్ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడతాడోననే విమర్శలు పవన్ పై ఇప్పటికే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: