రేపే రథసప్తమి - సూర్యభగవానుని జన్మదినం

మన పురాణాలలో సూర్యభగవానుని గురించి అనేక కథలు, ఆయన పూజా ప్రక్రియలు ఉపాసనా విధానాలు వున్నాయి. ఈ సంవత్సరం జనవరి 21నుంచీ మాఘమాసం ప్రారంభ మైంది. ఈ మాసంలోని శుద్ధసప్తమే రధసప్తమి అంటే ఆ పండుగ రేపన్నమాట. అంటే 24 జనవరి ప్రత్యక్ష పరమేశ్వరుడు శ్రీ సూర్యనారాయణ జన్మదినం జరుపు కుంటున్నాం. సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము. 


నిత్య జీవితంలో సూర్యభగవానుడు అనేక విధాల సహాయపడతాడు.  అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదించి, మన చుట్టూ ఏం వున్నదో చూసే అవకాశం ఇస్తు న్నాడు.  వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమేగాక, జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు. మనం కాలాన్ని గుర్తించేది, సూర్య గమనాన్ననుసరించే. ఒక  పగలు, ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా.  అన్నింటికన్నా ముఖ్యమైనది, భూమి మీద వున్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసా దిస్తాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యభగవానుని నుంచి మనం పొందే ప్రయోజనాలకు లెక్కేలేదు. 


రధసప్తమినాడు చేసే స్నానానికి ఒక విశేషం వున్నది. ఆ రోజు నదిలో, చెరువులో, ఎవరు వీలునుబట్టి వారు స్నానం చేసినా, తలమీద, భుజాలమీద జిల్లేడు ఆకులు పెట్టు కుని తెలిసీ తెలియక చేసిన పాపాలు ఈ రధసప్తమి స్నానంతో తొలగిపోవాలని ప్రార్ధిస్తూ స్నానం చేస్తారు. కొందరు చిక్కుడు ఆకులు, రేగుపళ్లు కూడాపెట్టుకుంటారు. ఉదయం దొడ్లో తులసి కోట దగ్గర సూర్యుడు, చంద్రుడు, అశ్వనీ దేవతలు, మున్నగు దేవతలకి చిన్నచిన్న రంగవల్లులు తీర్చిదిద్దుతాము.


రెండు చిక్కుడుకాయల మధ్య పైన ఒకటి కింద ఒకటి పుల్లలు గుచ్చి, వాటిని సూర్య రధాలుగా భావించి చిక్కుడు ఆకుల మీద వుంచి పూజ చేస్తారు.  గొబ్బిపిడకలతో చేసిన పొయ్యిమీద పాలు పొంగించి పరమాన్నం వండి,  చిక్కుడు ఆకులలో సూర్యుడు, చంద్రుడు, అశ్వని దేవతలు మొదలైన దేవతలకు విడివిడిగా నైవేద్యం పెట్టి తామూ ప్రసాదం తీసుకుంటారు. పిడకల మీద వండిన ఆ పరమాన్నం చాలా రుచిగా వుంటుంది.


మాఘమాసంలో రధసప్తమే కాదు, సూర్యుడికి ముఖ్యమైన భాను వారాలన్నీ అంటే ఆదివారాలన్నీ కూడా విశేషమైనవే.  ఏ కార ణంవల్లనైనా రధసప్తమి నాడు పై విధంగా సూర్యారాధన చేయలేనివారు మాఘ మాసంలో ఏ ఆదివారం నాడైనా చేయవచ్చు. అంతేకాదు ఈ మాసంలో సముద్ర స్నానం కూడా విశేషమైనదే. ఉదయం నుంచి అస్త మయం దాకా (ఆ మాటకొస్తే సర్వకాల సర్వావస్ధలలో) తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. 


అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు. మనకి అన్ని విధాలా ఇంత మేలు చేస్తున్న ఆ సూర్యనారాయణునికి ఆలయాలు మాత్రం అతి తక్కువ వున్నాయి.


బహుశా ఆయన్ని ప్రత్యక్ష దైవంగా పూజించటంవల్లనేమో. సూర్య దేవాలయం అనగానే ముందు గుర్తొచ్చేది ఒరిస్సా లోని కోణార్క, గుజరాత్ లోని మధేరా. ఈ రెండు ప్రఖ్యాతి చెందిన ఆలయాలు అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ పర్యాటకు లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్న సూర్యదేవాలయాలలో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరస విల్లిలో వున్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం. 


అలాగే సికింద్రాబాదులో తిరుమలగిరిలో నిర్మిపబడిన శ్రీ సూర్యభగవాన్ దేవాలయం దినదిన ప్రవర్ధమానమపుతూ అనేక మంది భక్తులనాకర్షిస్తున్నది.  సృష్టి స్థితి లయ కారకుడు సూర్యభగవానుడు. అంటే ఆయన త్రిమూర్తి స్వరూపం. ఉదయవేళ లో బ్రహ్మ స్వరూపం, మద్యాహ్నం మార్తాండుడుగా శివస్వరూపం సాయంవేళలో చిరుదరహాస వదనంతో శ్రీమన్నారాయణు డుగా కనిపిస్తారు.


అందుకే సూర్యభగవానుణ్ణి  "ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాన్నేత్తు మహేశ్వరం, సాయంద్యాయే సదా విష్ణుం త్రిమూర్తి చంద్ర దివాకరం" అంటాం. అలా ప్రార్ధిస్థాం. త్రిమూర్తి స్వరూపుడు గా ఆయన్ను పూజించటం మన సాంప్రదాయం. కనిపించే దైవం అందుకే ఆయనకు దేవాలయాలు అతితక్కువ  పూజించడం మనసంప్రదాయం. మన సంస్కృతిలో సూర్యతత్వమే  తొలి మతం. మహాభారతం అరణ్యపర్వంలో సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను పొందాడు ధర్మరాజు. ఆ సందర్భంలో ధర్మజుడు చేసిన సూర్యస్తోత్రం 


“సప్తమ్యాం అథవా షష్ఠ్యాం భక్త్యా

పూజాం కరోతియః

అనిర్విణ్ణో అనహంకారీతం

లక్ష్మీర్భజతే నరమ్” 


సప్తమి లేదా షష్ఠి తిథులలో అహంకారం, విచారం లేకుండా భక్తితో భాస్కరుణ్ణి పూజించిన వారికి సమస్త ఐశ్వర్యాలు లభిస్తా యని ఈ శ్లోకానికి అర్థం. నమస్కార ప్రియుడైన భాస్కరుడు ఐశ్వర్య ప్రదాత మాత్రమే కాదు ఆపదలను నివారించేవాడు. సమస్త జీవులకు ఆత్మ సూర్యుడే. అందుకే ఆయన ఆరోగ్యప్రదాతగా కీర్తిగడించాడు. చర్మ, నేత్ర, హృద్రోగాల నివారణకు సూర్యారాధన శ్రేష్ఠం. అలాగే సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవత కూడా ఆయనే.

రేపే రథసప్తమి - సూర్యభగవానుని జన్మదినం 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: