బాజపా కూటనీతి నిజమైతే తమిళనాడులో పాగాకి ఇంతగా దిగజారాలా?

"యుద్ధంలో ప్రేమలో విజయం సాధించటానికి ఏమైనా చెయ్యొచ్చు-తప్పులేదు" అనే నానుడిని మరోసారి ఋజువు కాబోతుందా? తమిళనాడులో ఇప్పటికే శంకరగిరి మాణ్యాలు పట్టిపోయిన డిఎంకేకి మరోసారి జవసత్వాలిచ్చి జీవం పోసిన పటియాలా హవుజ్ కోర్ట్ తీర్పుతో ఆ పార్టీ మరోసారి పుంజుకోనుందా!


తమను అంటే డిఎంకెని ధారుణ అప్రతిష్ఠపాలు చేసి నేలకీడ్చిన "2జీ స్పెక్ట్రమ్‌ స్కాం" కేసు నుంచి బీజేపీ విముక్తి కలిగించిందా? ఇప్పుడు దానికి డిఎంకే - బీజేపీ తమకు చేసిన మేళ్ళకు బదులు ఋణం తీర్చుకునేందుకు సిద్ధపడుతుందా? ఆ మేరకు ఈ రెండుపార్టీల మధ్య సంధి కుదిరిందా? ఇన్నాళ్లూ అవినీతితో కుళ్ళికృసించిన  డీఎంకే ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటూ బిగ్గరగా గళమెత్తిన బీజేపీ గురువారం చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఈ రెండు పార్టీలు భవిష్యత్‌ లో వియ్యమంద బోతున్నాయేమోననే అనుమానం పొడసూపక మానదు. ఆ విషయాన్నే రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.


గత శాసన సభ ఎన్నికల సమయంలో తమిళనాడుకు ప్రచారానికి వచ్చిన ప్రధాని నరెంద్ర మోదీ- "దేశప్రజలకు చెందిన రూ.1.76 లక్షల కోట్లను దోచుకున్న బందిపోటు దొంగలు మీ తమిళనాడు రాష్ట్రంలోనే వైభవోపేతంగా వెలుగొందుతున్నారు. ఆ గజ దొంగల పార్టీని, ఆ పార్టీతో కుమ్మక్కై ఆ పాపపంఖిలంలో భాగస్వామ్యం పంచుకున్న కాంగ్రెస్ ను రాష్ట్రం సరిహద్దులు దాటేలా పారదోలాల్సిన అవసరముంది ఆ బాధ్యత మీదే" అని పిలుపిచ్చారు.


అలాంటి సత్యసంధుడు నీతికి పట్టంకట్టే ఆ అధినేతే ఇటీవల నేరుగా డీఎంకే సార్వభౌముడు కరుణానిధి నివాసగృహానికివెళ్లి వ్యక్తిగతంగా పరామర్శించి, ఆయన అనుగ్ర హం ఆశీస్సులు పొంది, ఢిల్లీ వచ్చి విశ్రాంతి తీసుకోవాలని ఆయన్ని అత్యంత హృదయంగమంగా కోరారు. ఇప్పుడు అదే బీజేపీ నేతలు "న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును తీర్పుగానే చూడాలి తప్ప పెడర్థాలు తీయకూడదు" అని సమ్మోహనంగా అంతకంటే సున్నితంగా చెపుతున్నారు. అయితే ఈ వియ్యానికి నెయ్యానికి తోడు తమ పార్టీ నేతలే ఈ కేసును నీరుగార్చారంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఈ కేసులో కీలకసూత్రధారి, పాత్రధారి సుబ్రమణ్యంస్వామి చేసిన వ్యాఖ్యలు ఈ రెండుపార్టీల నడుమ అవగాహన అనే అక్రమసంభందాన్ని వియ్యానికి ముందే బట్టబయలు చేస్తున్నాయి. తమిళనాట ఎలాంటి బలంలేని బీజేపీ నేతలు, జయలలిత మరణం తో అనాధగా ఉన్న అన్నా- డీఎంకే ను కలుపుకొనేందుకు నిస్సిగ్గుగా బహిరంగంగానే ప్రయత్నాలు సాగించారు.


ముక్క చెక్కలై చిత్తడి చిత్తడై చినిగిన ఇస్తరిలా మారిన ఆ పార్టీతో కలసి ముందుకు సాగినా పెద్దగా తమకు మున్ముందు ఒరిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదని  తేలి పోవడంతో తమ మనసుకు సర్ధిచెప్పుకొని తమ పంధా మార్చుకున్నారు. అంతేగాక ఈ సారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, డీఎంకే ఘన విజయం సాధిస్తుందని అనేక సర్వేలు చెపుతున్న దరిమిలా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తగినంత ఆధిఖ్యత చేకూరని పక్షంలో డీఎంకే సహాయం సహకారం పొందేందుకు 'మోదీ-షా'  వ్యూహాత్మకంగా సిద్ధమయ్యా రని బీజేపీ వ్యూహకర్తలు కొందరి అభిప్రాయం. బాజపా తో సిద్ధాంతాల పరంగా పొసగని డిఎంకె తో చేతులు కలిపేందుకు తొలుత డీఎంకేనే విముఖత ప్రదర్శించినా, ఈ 2జి స్కాంజు నుండి తమ ప్రియతనయ తమ కనిమోళిని అంతెవాసి రాజాని బయటపడేసి, భావి బంగారుపంటలు పండించగల అవసరాలను బాజపా మత్రమే తీర్చగలదన్న రాజకీయ వ్యూహాల దృష్ట్యా ఆ పార్టీ నేతలు తలొగ్గారని తెలిపారు.


"డీఎంకే-బీజేపీ" మధ్య "పొత్తు పొడుపు" తమిళనాడు రాష్ట్రరాజకీయాల్లో కొంగ్రొత్త కలయికలు, పొందులు, పొత్తులు తీసుకురాగలదని కొత్తకొత్త సమీకరణాలను మనం చూడొచ్చంటున్నారు రాజనీతిఙ్జులు. అదే బాజపా రాజకీయ కూటనీతిలో కాంగ్రెస్ ను మించిపోయిందని చెప్పొచ్చు.  ఈ సందర్భంగా సందట్లో సడేమియాలాగా కొందరు కాంగ్రెస్ కథానాయకులు కూడా ఈ తీర్పు తరవాత డిఎంకె అధినేతలను కలసి వారి కరుణాకటాక్ష వీక్షణాలను అర్ధించిన దాఖలాలు కూడా ప్రదర్శితమయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: