తెలంగాణాలో రేవంత్ కేంద్రంగా మలుపులు తిరుగుతున్న రాజకీయాలు

రేవంత్ రాజీనామా స్టెప్ తీసుకోవటంతో, రాజకీయాలు అనుకోని మలుపు తిరిగితే  ఆ అనుభవం ఎలా ఉంటుందో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణ తెలుగుదేశం మాజీ ఎమెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్తా కాంగ్రేస్ లోకి  జంపై హైడ్రోజన్  బాంబ్ గా మారిన వైనం ప్రత్యక్షంగా తెలంగాణ, పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్ సభాపతులకు నైతిక సంకటంగా పరిణమించడం అనుకోని పరిణామమే మరి.

కేసీఆర్ అనే రాజకీయ దురంధరుణ్ణీ ఢీ కొనేందుకు మానసికంగా, రాజకీయంగా, సిద్ధమైన రేవంత్ రెడ్డి తెలిసి చేసినా, తెలియక చేసినా ఆయన రాజీనామా రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్స్టిస్తూ, పెండింగ్ లో ఉన్న ఎమెల్యేల రాజీనామా తేనెతుట్టెను కదిలించింది.  ఈ వ్యవహార ఫలితం రాజకీయ వెండితెరపై ఎలా కనిపించినా, రేవంత్ రెడ్డి నిర్ణయం కెసిఆర్ విషయంలో మాత్రం ఎప్పటికీ చర్చనీయాంశంగానే నిలిచిపోతుంది.


ఎవరి నెప్పుడు పొగుడుతాడో, తెగుడుతాడో  తెలియని రాంగోపాల్‌ వర్మ లాంటి వారే రేవంత్‌ రెడ్డి పై శ్రద్ధ కనపరిచారు. రేవంత్ రాజీనామా నిర్ణయం ఇప్పుడు రెండు రాష్ట్రాల సభాపతులకు నిస్సందేహంగా సంకటమే, సమస్యాత్మకమే. ధర్మ సంకటం ధర్మ సంక్లిష్ఠంగా మారింది. ఏదేలా ఉన్నా ఇదొక "కేస్-స్టడి"గా మారింది.  రేవంత్ ఇతర రాజకీయనాయకుల్లా పదవులు పట్టుకుని పీకు లాడే రకం కాదని, నిఖార్సయిన నైతిక విలువలు న్న వ్యక్తినని చాటేందుకే రాజీనామాతో పాటు, గన్‌మెన్లను వెనక్కి పంపి నప్పటికీ, నిజానికి ఆయనొక వ్యూహాన్ని సిద్ధం చేసుకొనే ఈ బరిలోకి దిగారు.

తన రాజీనామాను సభాపతి ఆమోదించినా, ఆమోదించక పోయినా ఎలా జరిగినా ఆయన వ్యూహం ప్రకారం ఆయనకు లాభమే. ఇక్కడ రేవంత్ రాజకీయంలో "చాణక్యం ప్రదర్శిస్తూ ఎత్తుగడ"  వేశారు. సభాపతి ఒకవేళ తన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్‌ లో ఉంచినంత కాలం సాంకేతికంగా తాను విధాన సభ సభ్యుడుగానే కొనసాగుతారు. ఈ కాలములో ఇతరులెవరూ చేయలేని "రాజీనామా ఆమోదం" కోసం సభాపతిపై తీవ్ర ఒత్తిడి తెస్తారు. ఖచ్చితంగా ఈ వత్తిడి సభాపతికి ధారుణమైన ధర్మ సంకటమే. ఉక్కిరి బిక్కిరి చేసే విషయమే. నిజంగా చెప్పాలంటే శాసనసభకు రావాలంటేనే, సభాపతికి ముచ్చెమటలు పట్టేలాగా  చేయవచ్చు. దాదాపుగా రాగింగే అవుతుంది.


శాసనసభ తన రాజీనామా ఆమోదించే పరిస్థితిలో లేకపోతే రేవంతుకు ఇంకా మంచిది. ఎందుకంటే శాసనసభాకాలం పూర్తవటానికి దగ్గరగానే ఉంది. ఈ కథనం ఎంత కాలం కొనసాగుతుందనేది నిజంగా సభాపతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాని నేటి ఉభయతెలుగు రాష్ట్రాల సభాపతులు స్వయం నిర్ణయాలు తీసుకోగల సమర్ధులు కాదు. అందుకే ఇక కేసీఆర్ దయ, రేవంత్ అదృష్టం!


ఒకవేళ సభాపతి రాజీనామా ఆమోదిస్తే ఇప్పటికే  టి-టిడిపి గోడదూకి టిఆరెస్ లోకి చేరి మంత్రిగా కొనసాగుతు తలసాని శ్రీనివాసయాదవ్ గతంలోనే ఇచ్చిన రాజీనామానూ కూడా ఆమోదించక తప్పదు. 


"టిడిఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనమైనందున, ఇక ఆ ముచ్చటే ఉండదని" తలసాని శ్రీనివాసయాదవ్ అంటున్నా, ఆయనతో పాటు కారెక్కిన మాజీ తమ్ముళ్ల నైతిక వ్యవహారం సహజంగానే తెరపై కొచ్చి అది రచ్చ రచ్చ అవటం ఖాయం.  నిర్ణయం అంటూ జరిగితే అది తలసాని కోరుకున్నట్లు జరగదు, తలపోటు తీసుకురాక మానదు.  ఎందుకంటే "రిట్రోస్పెక్టివ్ ఎఫ్ఫెక్ట్" అనేది ఒకటి చచ్చేడ్చింది. ఆయనవరకు వేటుపడక తప్పదు.  అప్పుడు నిర్ణయం తీసుకోవడం సభాపతికి, కెసిఆర్ కు చాలా కష్ఠం.


ఇప్పుడు రేవంత్ మాదిరి గానే అప్పుడు తలసాని కూడా అన్నింటికీ తెగించే, వ్యూహాత్మకంగా రాజీనామా చేశారు. ఆయన ఇలాకాలో సెటిలర్ల దన్ను ఉన్నందున గెలుపు కష్టమేమీ కాదు. ఒకవేళ కేసీఆర్ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే సామూహిక ఎన్నికలు తప్పవు. మరి కల్వకుంట్ల చంద్రుడు అంతపాటి సాహస చంద్రుడు అవగలడా?  అన్నది మున్ముందు తేలుతుంది. 


ఈ మొత్తం వ్యవహారంలో రేవంతుకు నష్టమేమీ లేదు కాని సభాపతి గారి 'నిర్ణయరాహిత్యం మాగ్నిఫై'  అవుతుంది. అదే రాను న్న ఎన్నికల్లో సభాపతికి ఖచ్చితంగా నష్టం చేస్తుంది. కేసిఆర్ కూ ధర్మసంకటమే. అందరితో పాటు ఎన్నికలకు వెళితే రేవంత్ నలుగురితో పాటు నారాయణ అవుతారు. అప్పుడు కేసీఆర్‌కు కేవలం తన ఇలాకా పైనే దృష్టి సారించే సమయం ఉండటమే కష్టం. కేవలం రెవంత్ రాజీనామానే ఆమోదిస్తే, ఎలాగూ నైతికత కోసం రచ్చబండ దగ్గర రచ్చ మొదలైతే అధికార పార్టీ ప్రతిష్ఠ అథఃపాతాళంలోకి పడటం ఆ తరవాత న్యాయసమస్యలు కొత్తగా పుట్టుకురావటం ఖాయం. ఈ వ్యవహారంలో అసలు సంకటం సభాపతి చుట్టూ తిరుగుతుంది. పరోక్షంగా కేసిఆర్ కే సమస్య.  పార్టీ గీత దాటిన వారిపై వేటు వేయాలంటూ టిడిఎల్పీ గతం లో ఇచ్చిన ఫిర్యాదులను నైతికంగా పరిష్కరించాల్సి ఉంటుంది.


టి-టిడిపి ఎమెల్యేలు "ఫిరాయించారు" అంటూ ఫిర్యాదు చేసిన కొందరు ఎమెల్యేలు వారూ నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన వారే, ఇప్పుడు తెరాస తీర్థం తీసుకున్నప్పటికీ, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం సభాపతి నైతిక ధర్మం.  అయితే ఇక్కడే చిన్న గొళ్ళెం ఉంది. "సభాపతి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కెవరికీ లేదు. కోర్టు కెక్కి గత కేసు తీర్పుల పార్లాన్స్ లను త్రవ్వి తీసినా, అదేదో రాష్ట్రంలో అలా చేసినందున, ఇక్కడా అదే వర్తిస్తుందని కోర్టు కూడా చెప్పదు. పెండింగ్ పిటిషన్లు త్వరగా తేల్చమని చెబుతుందే తప్ప, ఫలానా విధంగా చేయాలని కోర్టు కూడా చెప్పదు"   రెవంత్ రాజీనామా అమోదించి తలసానిని వదిలేస్తే "న్యాయస్థానాలు ఒక్కసారిగా లెజిస్లేచర్ పై దాడి చేస్తాయి. ఒకరి కొక రూలు - మరొకరి కోక రూలా అంటూ?"  అది చాలు రచ్చబండలో రచ్చ రంబోలా అవటానికి,  రంజు కావటానికి.


రేవంత్ సొంత ఇలాకా కొడంగల్‌ లో తాము ఖచ్చితంగ గెలుస్తామని, గూఢచారులు కచ్చితంగా చెబితే తప్ప కేసీఆర్ ఏనాటికీ ఉపఎన్నికకు వెళ్ళే సాహసం చేయరు. --అసలే రెవంత్ ఆపై కేసిఆర్ తో ఢీ అంటే ఢీ  అంతవరకూ రేవంత్ నానా హంగామా హడావిడి చేసి, నా రాజీనామా ఆమోదించాల్సిందేనని పట్టుపట్టి మీడియాలో ఉచిత ప్రచారం పొందవచ్చు.


ఇక్కడ రేవంతు కూ నైతిక సంకటం లేకపోలేదు. తన రాజీనామా సభాపతి తేల్చనందున అప్పటివరకూ సభకు వస్తానంటే, రేవంత్ ఇప్పటి వరకూ చెప్పిన నైతిక విలువలు గట్రా ఆయనకు అసలుకే ఎసరు తెచ్చి హీరో కాస్తా జీరో అవుతారు. రేవంత్ వ్యూహం ఫలిస్తే ఉపఎన్నికలు, లేకపోతే రాజీనామా చేసిన నైతికవిలువలున్న నేతగా మిగిలిపోతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: