ట్విస్ట్ : పచ్చ కండువా కప్పుకోని బుట్టా రేణుక..!

Vasishta

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరబోతున్నారంటూ చాలాకాలంగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఆమె ... టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. కానీ కండువా కప్పుకోలేదు. కప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ ఈ ట్విస్ట్ ఏంటి..!?


          కర్నూలు ఎంపీ బుట్టా రేణుక 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికే చంద్రబాబును కలవడంతో ఆమె టీడీపీలో చేరిపోయినట్టు ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే .. తాను టీడీపీలో చేరలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ఆమె అడపాదడపా సీఎం చంద్రబాబు, లోకేశ్ లను కలవడంతో ఆమెను టీడీపీ వ్యక్తిగానే చాలా మంది భావిస్తూ వచ్చారు. అయితే ... వైసీపీ సమావేశాలకు వెళ్తూ రావడంతో ఆమె ఇంకా వైసీపీలోనే ఉన్నారనే ఫీలింగ్ ఆ పార్టీ వారికి కలిగింది.


          ఇటీవల బుట్టా రేణుకతో పాటు ఇతర నేతల వ్యవహారం ఏంటో తేల్చేయాలనుకున్న జగన్.. వారిని లోటస్ పాండ్ కు పిలిచి చర్చలు జరిపారు. కర్నూలు ఎంపీ సీటు కావాలని కోరిన బుట్టా రేణుకకు జగన్ వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదని తేలింది. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలవబోతున్నారని తెలియగానే సైకిలెక్కేయడం ఖాయమనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ .. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.


          అయితే చంద్రబాబును కలిసిన రేణుక.. పలువురు నేతలకు పచ్చ కండువా కప్పించారు. తాను మాత్రం కప్పుకోలేదు. తాను టీడీపీలో చేరడం లేదని, ప్రభుత్వానికి మద్దతు మాత్రం ఇస్తానని ఆ తర్వాత ఆమె మీడియాకు వెల్లడించారు. ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానన్న ఆమె.. తనను జగన్ ఎందుకు సస్పెండ్ చేశారో తెలీదన్నారు. వైసీపీతో తన భర్త కొంత విభేదించినా.. తాను మాత్రం మనస్ఫూర్తిగా పార్టీకోసం పనిచేశానని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చించేందుకు కలిసినా .. పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేశారని.. అందుకే ఇప్పుడు బహిరంగంగా వచ్చి మద్దతు ప్రకటించినట్టు బుట్టా రేణుక వెల్లడించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.


          బుట్టా రేణుక పార్టీలో చేరకపోవడానికి పలు కారణాలున్నట్టు తెలుస్తోంది. అమావాస్యకు ముందు పార్టీలో చేరడం ఇష్టం లేదని తెలుస్తోంది. దీపావళి తర్వాత చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కర్నూలులో భారీ బహిరంగ సభ పెట్టి పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఫిరాయింపుల తలనొప్పులు లేకుండా చూసుకునేందుకు, తనను అకారణంగా పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేశారని చెప్పుకునేందుకు ఇంకాస్త సమయం తీసుకోవాలనుకుంటున్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం.. వైసీపీతో బుట్టా రేణుక అనుబంధం ఇక తెగినట్టే. ఇప్పుడామె స్వేచ్ఛా జీవి. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆమె సైకిల్ గుర్తుతోనే బరిలోకి దిగబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: