కేసీఆర్.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్..!?

Vasishta

విపక్షాలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. అసహనంతో కేసీఆర్ మాట్లాడిన భాష సరికాదంటూ విపక్షాలన్నీ మూకుమ్మడి దాడికి దిగాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ... ఇలా అన్ని పార్టీల నేతలూ కేసీఆర్ పై పరుషపదజాలంతో విమర్శించారు.


నా రాజకీయ జీవితంలో కేసీఆర్ ఉపయోగించిన భాషను ఎప్పుడూ చూడలేదని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్ అసహనంతో భయపడిపోయి మాట్లాడినట్లు కనిపించిందన్నారు. జేఏసీకి తానే పేరు పెట్టానని కేసీఆర్ చెప్పినమాట అవాస్తవమన్నారు. అన్ని పార్టీలూ కలిసి ఆ పేరు పెట్టామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా విమర్శించడం బాధాకరమన్నారు జానారెడ్డి.


          సింగరేణి ఎన్నికల్లో గెలిస్తే ప్రపంచకప్ ఫైనల్లో గెలిచినట్లు కేసీఆర్ ఫీలవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. తెలంగాణ ద్రోహులను పక్కనపెట్టుకుని.. ఉద్యమించినవారిపై విమర్శలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదా... అని వీహెచ్ ప్రశ్నించారు. ఉద్యమంలో కోదండరామ్ ను వాడుకుని ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా..? సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయావా..? అని వీహెచ్ అన్నారు. గవర్నర్ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారని ఆరోపించారు.


సింగరేణి ఎన్నికలపై కేసీఆర్ మాట్లాడిన మాటలు సురభి నాటకాన్ని తలపించిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కొడుక్కు కేటీఆర్ అని పెట్టుకున్నంత మాత్రాన ఆ తారకరామారావు అయిపోతాడా.. అని ఎద్దేవా చేశారు. పరిటాల రవిపైన ప్రేమతోనే ఆయన కుమారుడి పెళ్లికి వెళ్లానని చెప్పడం పచ్చి అబద్దమని చెప్పారు. పరిటాల హత్య సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారంలో ఉన్నారన్నారు. కోదండరామ్ పైన విమర్శలు చేయడం సిగ్గు చేటు అని రేవంత్ రెడ్డి అన్నారు. వెలమ కులం నుంచి కేసీఆర్ ను బహిష్కరిస్తేనే.. ఆ కులానికి గౌరవం ఉంటుందన్నారు. తెలంగాణకోసం బలిదానం చేసుకున్నవారి కుటుంబాల్లో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చావా.. అని రేవంత్ నిలదీశారు.


కేసీఆర్ మాట తీరును బీజేపీ కూడా విమర్శించింది. ఆయన మాట తీరును ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను ఎలా గౌరవించాలో కూడా కేసీఆర్ కు తెలియడం లేదన్నారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కోదండరామ్ ను వాడు వీడు అను మాట్లాడడం ఏం సంస్కారమని కిషన్ రెడ్డి నిలదీశారు. మీకు వ్యతిరేకంగా పాటలు పాడితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.


ఓవరాల్ గా కేసీఆర్ మాటలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ముఖ్యమంత్రిపై విపక్షాలన్నీ మూకుమ్మడిగా విరుచుకపడుతున్నాయి. వెంటనే కోదండరామ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: