పళని స్వామితోనే గేమ్స్ ఆడతారా..? ఇక కాస్కోండి...!!

Vasishta

తమిళనాడు సీఎం పళనిస్వామి తన సీటుకు ఎసరు రాకుండా జాగ్రత్త పడుతున్నారా ? ఇందుకోసం మరో కొత్త ప్లాన్ కు సిద్ధమయ్యారా ? చెవిలో జోరీగలా మారిన దినకరన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలతో కుదిరిన రహస్య ఒప్పందంతో ఐదేళ్ల పాటు తానే సీఎంనంటూ చెప్పడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.

 

కయ్యానికి కాలు దువ్వుతున్న పన్నీరు సెల్వంను రాజనీతితో విలీనం చేసుకున్న తమిళనాడు సీఎం పళని స్వామి ఇప్పుడు మన్నార్ గుడి మాఫియాపై దృష్టి సారించారు. చీటికిమాటికి అవిశ్వాసం అంటూ డెడ్ లైన్లు విధిస్తున్న దినకరన్ కు వరుస షాకులిచ్చిన పళని... తాజాగా మన్నార్ మాఫియా బలంపైనే దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఏ ఎమ్మెల్యేలనైతే చూపి తనను ఇబ్బందులు పెడుతున్నాడో అదే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.

 

దినకరన్ కు మద్ధతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సాయంతో అనర్హత వేటు వేయించిన పళనికి హైకోర్టులో ఊరట లభించలేదు. దీంతో వారిని తన వైపు తిప్పుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇందుకోసం సామ భేద దండోపాయలు ఉపయోగిస్తున్నారు. హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చి.. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలను ఓటింగ్ కు అనుమతించినా ఎలాంటి ఢోకా రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలుచేస్తున్నారు. హైకోర్టు ఓటింగ్ కు అనుమతిస్తే తన వర్గంలో చేరే విధంగా ఇప్పటి నుంచే చర్చలు ప్రారంభించారు. ఒకవేళ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధిస్తే ఉప ఎన్నికల్లో పార్టీ తరపున  వారికే సీటు ఇస్తామంటూ హామి కూడా ఇస్తున్నారట. ఈ రెండింటికి అంగీకరించకుండా దినకరన్ వెంటే ఉండే వారికి తన బలం ఏంటో తెలిసేలా చేస్తున్నారు.

 

తాజాగా దినకరన్ వర్గంలో కీలకనేతగా సెంథిల్ బాలాజీ నివాసాల్లో ఐటీ దాడులు ఇవే కోవలోకి వస్తాయంటున్నారు తమిళ తంబీలు. ఏక కాలంలో పదిచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం వెనక పళనిస్వామి ఉన్నారని బలంగా చెబుతున్నారు. ఈ హెచ్చరికలతోనే మరి కొందరు ఎమ్మెల్యేలు దినకరన్ వర్గంలోకి వచ్చే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు ఎమ్మెల్యేలు పళనిస్వామితో టచ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హైకోర్టు వీరికి అవకాశం ఇచ్చి  బలనిరూపణకు ఆదేశిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమయినట్టు సమాచారం. వీరి కోవలోనే మరికొంత మంది నడుస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.


ఐటీ దాడులు, పళనిస్వామి తాజా చర్యలపై దినకరన్ వర్గం ఎలాంటి ప్రకటన చేయకపోయినా  హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తోంది. అనుకూలంగా తీర్పునిస్తే ప్రభుత్వాన్ని కూల్చడంపై దృష్టి సారించాలని భావిస్తోంది. వ్యతిరేకంగా వస్తే కలిసి వచ్చే ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. జయ మరణం తరువాత డైలి సీరియల్ ను తలపిస్తున్న తమిళ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: